Nara Lokesh: మంగళగిరిలో మంత్రి లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు

Nara Lokesh Receives Warm Welcome in Mangalagiri
  • మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ కొత్త కార్యక్రమం
  • 'సుపరిపాలనలో తొలి అడుగు' పేరుతో శ్రీకారం
  • ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ విజయాల ప్రచారం
  • సీతానగరంలో రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన
  • రూ.295 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నిర్మాణం
  • వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారమని వెల్లడి
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం తన నియోజకవర్గమైన మంగళగిరిలో పర్యటించారు. తాడేపల్లి పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ఒక నూతన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, లోకేశ్ తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు.

అనంతరం, తన పర్యటనలో భాగంగా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మించ తలపెట్టిన రిటైనింగ్ వాల్ పనులను మంత్రి లోకేశ్ పరిశీలించారు. సుమారు రూ.295 కోట్ల అంచనా వ్యయంతో ఈ కీలకమైన ప్రాజెక్టును చేపడుతున్నట్లు అధికారులు ఆయనకు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం సీతానగరం, పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు. ప్రతి ఏటా వరదల సమయంలో కృష్ణా నదికి భారీగా నీరు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ వాల్ నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్మాణంతో స్థానికులకు వరద ముప్పు పూర్తిగా తప్పుతుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలోనూ స్పందించారు. 

"కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని మహానాడు కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో-తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటింటికీ తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశాను. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చాను" అని వివరించారు. 

Nara Lokesh
Mangalagiri
Tadepalli
Retaining Wall
Krishna River
Andhra Pradesh
AP Politics
Governance
Flood Control
Suparipalanalo Tholi Adugu

More Telugu News