Dhanunjaya Reddy: ఏపీ లిక్కర్ స్కాం.. వాళ్లిద్దరికీ కోర్టులో చుక్కెదురు

Dhanunjaya Reddy Krishna Mohan Reddy Face Setback in AP Liquor Scam Case
  • లిక్కర్ స్కామ్ నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల బెయిల్ పిటిషన్‌లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
  • ఈ ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు
  • తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు 
వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎంఓ మాజీ కార్యదర్శి కె. ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

కాగా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏలుగా పనిచేసిన బాలాజీ, నవీన్‌లను సిట్ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరచగా, వారికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరినీ గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సిట్ అధికారులు రెండు రోజుల క్రితం ఇండోర్ వెళ్లి బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు లిక్కర్ స్కామ్ కేసులో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు పీఏలుగా పనిచేసిన బాలాజీ, నవీన్‌లు రాష్ట్రం విడిచి పరారయ్యారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వీరు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇండోర్‌లో తలదాచుకున్నారు. 
Dhanunjaya Reddy
AP Liquor Scam
Krishna Mohan Reddy
YSRCP
ACB Court
Chevi Reddy Bhaskar Reddy
Balaji
Naveen
Andhra Pradesh
Liquor Policy

More Telugu News