RCB: ఆర్సీబీకి బీసీసీఐ నోటీసులు

BCCI Issues Notice to RCB Regarding Stampede Incident
  • ఐపీఎల్ విజయోత్సవాల వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట
  • ఘటనపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్
  • ఆర్సీబీ, కేఎస్‌సీఏకు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ విజయోత్సవాల వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)కు బీసీసీఐ అంబుడ్స్‌మెన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

విజయోత్సవ వేడుకల్లో జట్టు తీవ్ర నిర్లక్ష్యం, మృతులు తదితర అంశాలపై వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఆదేశించారు. ఇందు కోసం నాలుగు వారాల గడువును విధించారు. దీంతో ఆర్సీబీ మరోసారి ఇబ్బందుల్లో పడినట్లయింది.

జరిగిన దుర్ఘటనపై ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ జూన్ 12న బీసీసీఐ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందన ఇవ్వాలని ఈ నోటీసులు జారీ చేశారని జస్టిస్ అరుణ్ మిశ్రా వెల్లడించారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా కేఎస్‌సీఏ, ఆర్సీబీలను ఫిర్యాదుదారు రాతపూర్వక సమాధానం కోరడం సముచితంగానే ఉందని బీసీసీఐ అంబుడ్స్‌మెన్ అభిప్రాయపడ్డారు.

ఆర్సీబీ తీవ్ర నిర్లక్ష్యం, భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రస్తుత యాజమానులు ఫ్రాంచైజీని విక్రయించకుండా నిషేదించాలని ఫిర్యాదుదారు కోరినట్లు తెలిపారు.

ఈ ఫిర్యాదుకు సంబంధించి కేఎస్‌సీఏ, ఆర్సీబీలు తమ లిఖిత పూర్వక సమాధానాలను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని, ఆ కాపీని ఫిర్యాదుదారునికి కూడా సమర్పించాలని ఆదేశించారు. అలాగే, మీకు ఎందుకు ఉపశమనం కలిగించాలో, నిబంధనల ప్రకారం మీ పిటిషన్‌ను ఎందుకు తిరస్కరించకూడదో కారణం చెప్పాలని అంబుడ్స్‌మెన్ అడిగారు.

దీనిపై మీరు ఏదైనా వివరణ ఇవ్వాలనుకుంటే పది రోజుల్లోగా దాఖలు చేయాలన్నారు. ఫ్రాంచైజీ జవాబుదారీతనం నుంచి తప్పించుకొనే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న దృష్ట్యా యథాతథ స్థితిని కొనసాగించాలని బీసీసీఐ అంబుడ్స్‌మెన్ ఆదేశించారు.

ఈ తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆర్సీబీ జట్టు కప్పు గెలిచిన వెంటనే విజయోత్సవాలు జరపడం, దాదాపు ఐదు లక్షల మంది ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడానికి జట్టు నిర్వాహకులు చేసిన ప్రకటనే కారణమని ఇటీవల కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. 
RCB
Royal Challengers Bangalore
BCCI
BCCI Ombudsman
KSCA
Chinnaswamy Stadium
IPL celebrations
Stampede
Arun Mishra
Vikas Kumar

More Telugu News