Bombay High Court: అలా చెప్పడం లైంగిక వేధింపు కాదు: బాంబే హైకోర్టు

Bombay High Court Says Saying I Love You Is Not Sexual Harassment
  • బాలికకు ఐ లవ్ యూ చెప్పిన నిందితుడికి 3ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించిన నాగ్ పూర్ సెషన్స్ కోర్టు
  • ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపుల కిందకు రాదన్న బాంబే హైకోర్టు
  • నాగ్ పూర్ కోర్టు తీర్పును డిస్మిస్ చేసిన బాంబే హైకోర్టు
"ఐ లవ్ యూ" అని చెప్పడం లైంగిక వేధింపుల కిందకు రాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. పదేళ్ల నాటి లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే.. 2015 అక్టోబర్ నెలలో 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలికకు ఓ యువకుడు "ఐ లవ్ యూ" అని చెప్పాడు. దాంతో తమ కూతురిని ప్రేమ పేరుతో లైంగికంగా వేధించాడంటూ ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విచారణ జరిపిన నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు 2017 ఆగస్టులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దాంతో నిందితుడు సెషన్స్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. యువకుడు నోటితో "ఐ లవ్ యూ" అని చెప్పినంత మాత్రాన అది లైంగిక వేధింపు కిందకు రాదని తెలిపింది. అలానే నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆధారాలు లేవని చెప్పింది.

బాలిక పట్ల అసభ్యంగా తాకడం, ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటం, అసభ్యకరమైన సైగలు చేయడం వంటివి చేసి ఉంటే వాటిని లైంగిక వాంఛతో చేసిన చర్యలుగా భావించి లైంగిక వేధింపులుగా పరిగణించవచ్చని, కేవలం "ఐ లవ్ యూ" అని చెప్పడాన్ని లైంగిక వేధింపుగా పరిగణించలేమని వెల్లడించింది. నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు.. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. 
Bombay High Court
sexual harassment
Nagpur sessions court
I love you
POCSO Act
Section 354A IPC
Bombay HC verdict
minor girl
love proposal
court judgement

More Telugu News