Pakistani Celebrities: పాక్ సెలబ్రిటీల ఖాతాలపై భారత్‌లో మళ్లీ నిషేధం!

Pakistani Celebrities Accounts Banned Again in India
  • పాక్ సెలబ్రిటీల ఖాతాలపై గందరగోళం
  • ఒక్కరోజులోనే మళ్లీ నిషేధం  
  • షాహిద్ అఫ్రిది, ఫవాద్ ఖాన్ ఖాతాలపై మళ్లీ వేటు
  •  ‘ఆపరేషన్ సిందూర్’ విమర్శల నేపథ్యంలో గతంలో తొలిసారి నిషేధం 
భారత్‌లో పలువురు ప్రముఖ పాకిస్థానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం విధించారు. నిషేధాన్ని ఎత్తివేసి 24 గంటలు కూడా గడవకముందే మళ్లీ నిషేధం విధించడం గమనార్హం. ఈ ఉదయం నాటికి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో పాటు నటీనటులు ఫవాద్ ఖాన్, మావ్రా హోకేన్, యుమ్నా జైదీ, హనియా ఆమిర్ వంటి వారి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ప్రొఫైళ్లు భారతీయ యూజర్లకు అందుబాటులో లేకుండా పోయాయి.

నిన్న అనేక పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హఠాత్తుగా భారత్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం నిశ్శబ్దంగా వెనక్కి తీసుకుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజే ఖాతాలు మళ్లీ మాయమవడంతో గందరగోళం నెలకొంది.

ఎవరైనా భారతీయ యూజర్లు పాకిస్థానీ సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైళ్లను వెతికితే "చట్టపరమైన అభ్యర్థనకు అనుగుణంగా ఈ కంటెంట్‌ను పరిమితం చేశాం. అందువల్ల ఈ ఖాతా భారతదేశంలో అందుబాటులో లేదు" అనే సందేశం కనిపిస్తోంది. దీన్నిబట్టి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ఈ నిషేధాన్ని ఎందుకు పునరుద్ధరించారనే విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో, ముఖ్యంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఈ నిషేధాన్ని తొలిసారిగా విధించారు. ఆ సమయంలో పలువురు పాకిస్థానీ ప్రముఖులు భారత సైనిక చర్యను బహిరంగంగా విమర్శించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వారి సోషల్ మీడియా ఖాతాలను భౌగోళికంగా భారత్‌లో నిరోధించే (జియోబ్లాకింగ్) చర్యలు చేపట్టింది. తాజాగా ఈ నిషేధాన్ని మళ్లీ అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 
Pakistani Celebrities
Shahid Afridi
Fawad Khan
Mawra Hocane
Yumna Zaidi
Hania Aamir
India Pakistan relations
Social Media Ban India
Operation Sindoor
Pakistan Social Media

More Telugu News