Manojit Mishra: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచారం కేసు.. నిందితుడి లాయర్ లైసెన్స్ రద్దు

Kolkata Rape Case Lawyer Manojit Mishra Loses License
  • కోల్‌కతా లా విద్యార్థిని రేప్ కేసులో కీలక పరిణామం
  • మనోజిత్ మిశ్రా లాయర్ లైసెన్స్ రద్దు చేసిన బార్ కౌన్సిల్
  • రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేసే అర్హత కోల్పోయిన నిందితుడు
  • ఇప్పటికే కాలేజీ నుంచి బహిష్కరించిన యాజమాన్యం
  • కేసులో మనోజిత్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సౌత్ కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా న్యాయవాద లైసెన్సును పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో బార్ కౌన్సిల్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో మనోజిత్ మిశ్రా రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హతను కోల్పోయాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందిన కేవలం ఏడు రోజుల్లోనే బార్ కౌన్సిల్ ఈ కఠిన చర్యలు తీసుకోవడం గమనార్హం. నిన్న సమావేశమైన బెంగాల్ బార్ కౌన్సిల్, న్యాయవాదుల జాబితా నుంచి మనోజిత్ మిశ్రా పేరును తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బార్ కౌన్సిల్‌కు కూడా తెలియజేయనున్నట్టు స్పష్టం చేసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిశ్రాపై బార్ కౌన్సిల్ తీసుకున్న ఈ చర్యను పలువురు స్వాగతిస్తున్నారు. 

మనోజిత్ మిశ్రా, అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం (టీఎంసీపీ)లో కీలక నేతగా వ్యవహరిస్తూ అలీపూర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేసు తీవ్రత దృష్ట్యా కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. అనంతరం కేసును కోల్‌కతా పోలీస్ డిటెక్టివ్ విభాగానికి బదిలీ చేశారు.

ఈ కేసులో మనోజిత్ మిశ్రాతో సహా మొత్తం నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు, బార్ కౌన్సిల్ నిర్ణయానికి ఒకరోజు ముందు, అంటే మంగళవారం సౌత్ కోల్‌కతా లా కాలేజీ పాలకమండలి కూడా మిశ్రాపై వేటు వేసింది. కాలేజీలో అతను నిర్వహిస్తున్న తాత్కాలిక పదవి నుంచి తొలగించడంతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు విద్యార్థులను కూడా కాలేజీ నుంచి బహిష్కరించింది. వరుస చర్యలతో నిందితుడిపై ఉచ్చు బిగుసుకుంటోంది.
Manojit Mishra
Kolkata Law Student Rape Case
West Bengal Bar Council
Lawyer License Revoked
TMCP
Alipore Court
South Kolkata Law College
Kolkata Police
Crime News

More Telugu News