Nithin Koushik: హెచ్‌1బీ వీసా తిరస్కరణ శాపం కాదు, వరం.. ఆలోచింపజేస్తున్న నిపుణుడి వాదన!

Nithin Koushik analysis H1B visa rejection a blessing
  • హెచ్‌1బీ వీసా తిరస్కరణకు గురైతే బాధపడొద్దన్న సీఏ నితిన్ కౌశిక్
  • ఇది ఒకరకంగా మంచికేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్
  • భారత్‌లో రూ. 20-25 లక్షల జీతంతో నాణ్యమైన జీవితం సాధ్యమని వెల్లడి
  • విదేశాల్లో డాలర్ల జీతాలతో పాటు ఖర్చులు, ఒత్తిడి కూడా అధికమేనన్న కౌశిక్
  • వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో యువతకు గొప్ప అవకాశాలున్నాయని స్పష్టీకరణ
  • వీసా తిరస్కరణను మరో మంచి అవకాశంగా చూడాలని నిపుణుడి సూచన
అమెరికాలో ఉద్యోగం, డాలర్లలో జీతం.. ఎంతోమంది భారతీయ యువత కల ఇది. దీనికి మార్గమైన హెచ్‌1బీ వీసా పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే, ఒకవేళ ఆ వీసా తిరస్కరణకు గురైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అదొక రకంగా శుభపరిణామమేనని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నితిన్ కౌశిక్ చేసిన ఓ విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎంతోమంది హెచ్‌1బీ వీసాదారులు భారత్‌కు తిరిగి వస్తున్నారని, ఇది బాధ కలిగించే విషయమే అయినా, మరో కోణంలో చూస్తే ఇది గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు.

"హెచ్‌1బీ వీసా తిరస్కరణ బహుశా మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ విషయం కావచ్చు" అంటూ నితిన్ కౌశిక్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. విదేశాల్లో జీతాలు డాలర్లలో ఆకర్షణీయంగా కనిపించినా, అక్కడి ఖర్చులు, అద్దెలు, పిల్లల సంరక్షణ, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటాయని ఆయన గుర్తుచేశారు. కానీ, భారతదేశంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వివరించారు.

భారత్‌లో ఏటా రూ. 20-25 లక్షల జీతంతో అత్యంత నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చని కౌశిక్ ఉదాహరణలతో సహా తెలిపారు. మెట్రో నగరాల్లో మంచి 2బీహెచ్‌కే ఫ్లాట్ లేదా టైర్-2 నగరంలో విల్లా, కారు, ఇంటి పనులకు సహాయకులు, పిల్లలకు మంచి విద్య, ప్రపంచ స్థాయి ప్రైవేట్ వైద్య సదుపాయాలు వంటివన్నీ ఈ జీతంతోనే సౌకర్యవంతంగా పొందవచ్చని పేర్కొన్నారు. అమెరికా, యూకే, కెనడా వంటి దేశాల్లో ఇలాంటి జీవనశైలిని ఊహించడం కూడా కష్టమని ఆయన పోల్చి చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంటే, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని కౌశిక్ అన్నారు. అందువల్ల, ఇక్కడే ఉండి ఈ వృద్ధిలో భాగస్వాములు కావడం ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని సూచించారు. కుటుంబం, సంస్కృతికి దగ్గరగా ఉండటం వల్ల లభించే మానసిక ప్రశాంతతను మరేదీ భర్తీ చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ తిరస్కరణను ఒక వైఫల్యంగా కాకుండా, సొంత దేశంలోనే ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు లభించిన మరో అవకాశంగా చూడాలని ఆయన సూచించారు.
Nithin Koushik
H1B visa
H1B visa rejection
Indian economy
Job opportunities India
Cost of living
Work life balance
Career in India
US jobs
IT professionals

More Telugu News