Student Visas: అమెరికా స్టూడెంట్ వీసాలు మళ్లీ షురూ.. కానీ ఈసారి కొత్త రూల్స్!

US Student Visas Resume with New Rules and Warnings
  • తిరిగి ప్రారంభమైన అమెరికా విద్యార్థి వీసా దరఖాస్తుల స్వీకరణ
  • దరఖాస్తుదారులకు అమెరికా విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరిక
  • చదువు పేరుతో వచ్చి ఇతర పనులకు చేయొద్దని స్పష్టీకరణ
  • సోషల్ మీడియా ఖాతాలకు 'పబ్లిక్ వ్యూ' తప్పనిసరి
  • విద్యార్థి వీసాలకు కాలపరిమితిపై కొత్త ప్రతిపాదనలు
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు శుభ‌వార్త‌. సుమారు నెల రోజుల విరామం తర్వాత విద్యార్థి వీసా దరఖాస్తుల స్వీకరణను పునఃప్రారంభించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈసారి దరఖాస్తుదారులకు కొన్ని కఠినమైన నిబంధనలతో పాటు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. వీసా మంజూరు ప్రక్రియలో కీలక మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది.

చదువుపైనే దృష్టి పెట్టాలి: అమెరికా హెచ్చరిక
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హ్యూస్టన్ మాట్లాడుతూ... విద్యార్థి వీసా దరఖాస్తులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, ఒక విషయాన్ని విద్యార్థులు స్పష్టంగా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 

"విద్యార్థులు ఏ ఉద్దేశంతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారో, ఆ పని కోసమే దానిని ఉపయోగించుకోవాలి. అమెరికాకు వచ్చిన తర్వాత చదువును మధ్యలో వదిలేయడం లేదా క్యాంపస్‌లలో విధ్వంసానికి పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం సహించబోం" అని ఆమె స్పష్టం చేశారు. 

దేశ జాతీయ భద్రత, వలస చట్టాలను దృష్టిలో ఉంచుకునే తమ విధానాలు ఉంటాయని, అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థ అత్యున్నత ప్రమాణాలతో కొనసాగేలా చూస్తామని ఆమె వివరించారు. ఈ నిబంధనలు కేవలం అమెరికా పౌరులకే కాకుండా, వారితో కలిసి చదువుకునే ఇతర దేశాల విద్యార్థుల భద్రతకు కూడా అవసరమని అన్నారు.

సోషల్ మీడియాపై కఠిన నిఘా
సోషల్ మీడియా ఖాతాల పరిశీలన ప్రక్రియ (వెట్టింగ్ ప్రాసెస్) కోసం గత నెల రోజులుగా నిలిపివేసిన దరఖాస్తుల స్వీకరణను జూన్ 18 నుంచి తిరిగి ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తమ అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తప్పనిసరిగా 'పబ్లిక్ వ్యూ'లో ఉంచాలని ఆదేశించింది. ఈ నిబంధనను పాటించని వారి దరఖాస్తులను తిరస్కరించడమే కాకుండా, భవిష్యత్తులో వారు అమెరికాకు వచ్చే అవకాశాలను కూడా కోల్పోతారని తేల్చిచెప్పింది.

వీసాలకు కాలపరిమితి ప్రతిపాదన
మరోవైపు విద్యార్థి వీసాలకు కూడా నిర్దిష్ట కాలపరిమితి విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడం విదేశీ విద్యార్థుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఎఫ్-1, జె-1 వీసాలపై అమెరికాలో ఉంటున్న వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. దీని ప్రకారం వీసా గడువు ముగిసిన ప్రతిసారీ విద్యార్థులు పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ విభాగం సమీక్షలో ఉన్నాయి.
Student Visas
US student visas
USA student visa rules
Foreign students USA
F-1 visa
J-1 visa
USA immigration
Study in USA
US Department of Homeland Security
Mignon Houston

More Telugu News