Chodapalli Erraiah: జాలరిని సముద్రంలోకి లాక్కెళ్లిన 100 కిలోల చేప.. అనకాపల్లి జిల్లాలో విషాదం

Fisherman Chodapalli Erraiah dragged into sea by 100kg fish in Anakapalli
  • కొమ్ము కోనాం చేప దాడి.. సముద్రంలో గల్లంతైన పూడిమడక గ్రామస్తుడు
  • గల్లంతైన ఎర్రయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులు
సముద్రంలో గాలానికి చిక్కిన ఓ భారీ చేప మత్స్యకారుడి పాలిట యమపాశమైంది. సముద్రంలోకి లాక్కెళ్లడంతో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘటన స్థానిక మత్స్యకారుల కుటుంబాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చోడపల్లి ఎర్రయ్య(45) మరో ఆరుగురు మత్స్యకారులతో కలిసి నిన్న తెల్లవారుజామున వేటకు బయల్దేరారు. తీరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతుండగా, వారి గాలానికి ఓ పెద్ద చేప చిక్కింది. దాదాపు 100 కిలోల బరువుండే 'కొమ్ముకోనాం' జాతికి చెందిన ఆ చేపను బోటులోకి లాగేందుకు ఎర్రయ్య తాడుతో ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు అతను నిలవలేకపోయాడు. అదుపుతప్పి పడవలో నుంచి సముద్రంలో పడిపోగా, ఆ చేప అతడిని బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది.

కళ్లెదుటే జరిగిన ఈ సంఘటనతో తోటి జాలర్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు ఒడ్డున ఉన్నవారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు హుటాహుటిన పడవల్లో సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ, ఎర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో పూడిమడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Chodapalli Erraiah
Anakapalli district
Pudimadaka village
fishing accident
Kommu Konam fish
fisherman
Andhra Pradesh
sea accident
Bay of Bengal

More Telugu News