YS Sharmila: కరేడు భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోం: వైఎస్ షర్మిల

YS Sharmila opposes land acquisition for Indosol in Karedu
  • నెల్లూరు జిల్లా కరేడు రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు
  • ఇండోసోల్ సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం
  • గ్రామ సభలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం నియంతృత్వ పోకడ అని విమర్శ
  • మూడు పంటలు పండే భూములను లాక్కోవద్దని ప్రభుత్వానికి డిమాండ్
  • భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని షర్మిల హెచ్చరిక
నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చని పొలాలను నాశనం చేసి పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కరేడు రైతుల భూముల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు కరేడు రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 

"కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం. 

గత వైసీపీ ప్రభుత్వం షిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దంటున్న రైతుల గోడు వినలేదు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. 

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫిషన్ ను రద్దు చేయండి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు... అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు" అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
YS Sharmila
Karedu
Andhra Pradesh
Nellore district
Indosol company
Land acquisition
Farmers protest
Solar plant
AP PCC
YSRCP

More Telugu News