Zohran Mamdani: చేత్తో బిర్యానీ తిన్నందుకు ట్రోలింగ్.. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై జాత్యాహంకార విమర్శలు

Zohran Mamdani Hand Eating Biryani Sparks Racism Row
  • చేతితో భోజనం చేసిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై దుమారం
  • భారత సంతతి నేతపై వెల్లువెత్తిన జాతి వివక్ష వ్యాఖ్యలు
  • అనాగరికం, అపరిశుభ్రమంటూ నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్
  • మన సంప్రదాయంపై పాశ్చాత్యుల చిన్నచూపుపై  చర్చ
అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత జోహ్రాన్ మమ్దానీ (33) తీవ్రమైన జాతి వివక్ష దాడిని ఎదుర్కొంటున్నారు. ఆయన చేసిన తప్పల్లా మనందరిలాగే చేతితో బిర్యానీ తినడమే. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయనపై విద్వేషపూరిత వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

వివరాల్లోకి వెళితే, డెమోక్రటిక్ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఉన్న జోహ్రాన్ మమ్దానీ ఇటీవల చేతితో భోజనం చేస్తున్న వీడియో ఒకటి జూన్ 29న ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ప్రముఖ భారత-అమెరికన్ ఫిల్మ్‌మేకర్ మీరా నాయర్ కుమారుడైన జోహ్రాన్, తన సాంస్కృతిక అలవాటు ప్రకారం భోజనం చేయడం కొందరు పాశ్చాత్యులకు నచ్చలేదు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "జంతువుల వలె తింటున్నారు", "ఇదో అనాగరిక చర్య", "అపరిశుభ్రమైన మూడో ప్రపంచ దేశపు అలవాటు" అంటూ అత్యంత అవమానకరమైన రీతిలో కామెంట్లు పెట్టారు. ఈ పరిణామం అమెరికాలోని సాంస్కృతిక అసహనంపై కొత్త చర్చకు దారితీసింది.

భారతదేశంతో పాటు అనేక దక్షిణాసియా దేశాల్లో చేతితో భోజనం చేయడం సాధారణమైన విషయమే కాక, అదొక సాంస్కృతిక సంప్రదాయం. భోజనానికి ముందు, తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం మన జీవనశైలిలో భాగం. ఆహారాన్ని స్పర్శిస్తూ తినడం వల్ల రుచి మరింత పెరుగుతుందని, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే, ఈ వాస్తవాలను విస్మరించి, కేవలం సాంస్కృతిక భిన్నత్వం కారణంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Zohran Mamdani
New York Mayor
Indian American
racism
cultural discrimination
biryani
hand eating
Mira Nair
South Asian culture
US politics

More Telugu News