Dalai Lama: దలైలామా వారసుడి ఎంపిక.. చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్

Dalai Lama Successor India Counters China on Selection
  • వారసుడి ఎంపికకు తమ ఆమోదం తప్పనిసరి అన్న చైనా
  • చైనా డిమాండ్‌ను తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
  • వారసుడిని ఎన్నుకునే హక్కు దలైలామాకు మాత్రమే ఉందని స్పష్టీకరణ
  • ఈ విషయంలో ఇతరులకు జోక్యం చేసుకునే హక్కు లేదన్న కేంద్రమంత్రి రిజిజు
  • తన వారసుడి ఎంపిక ప్రక్రియపై స్వయంగా ప్రకటన చేసిన దలైలామా
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా చేస్తున్న వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా ప్రస్తుత దలైలామాకు, ఆయన సంస్థకు మాత్రమే ఉంటుందని, ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావులేదని గురువారం స్పష్టం చేసింది. చైనా డిమాండ్‌ను తోసిపుచ్చుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని దలైలామా బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే చైనా స్పందించింది. తదుపరి దలైలామా ఎంపికకు తమ ఆమోదముద్ర తప్పనిసరి అని, తమ విధానాలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ జరగాలని డిమాండ్ చేసింది.

చైనా వాదనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. "దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంటుంది. దలైలామా స్థానం కేవలం టిబెటన్లకే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ ఎంతో ముఖ్యమైనది" అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రారంభమైన దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు భారత్ తరఫున కిరణ్ రిజిజు హాజరుకానున్నారు.

1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా, అప్పటి నుంచి ఆ ప్రాంతంపై పూర్తి నియంత్రణ కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా నియమించాలని ఎప్పటినుంచో వ్యూహాలు పన్నుతోంది. చైనా ఎత్తుగడలను గమనించిన దలైలామా, తన వారసుడి ఎంపికపై స్పష్టతనివ్వగా, ఆయనకు భారత్ బాసటగా నిలుస్తోంది.
Dalai Lama
Dalai Lama successor
China
India
Tibet
Tibetan Buddhism
Kiren Rijiju

More Telugu News