Pune Rape Case: కొరియర్ బాయ్ నంటూ వచ్చి యువతిపై అత్యాచారం... మళ్లీ వస్తానంటూ మెసేజ్!

Pune Rape Case Courier Boy Assaults Woman Sends Threatening Message
  • పుణెలో దారుణం.. డెలివరీ బాయ్ ముసుగులో యువతిపై అత్యాచారం
  • బ్యాంకు లెటర్ అంటూ నమ్మించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు
  • స్ప్రే చల్లి స్పృహ తప్పించి అఘాయిత్యం
  •  బాధితురాలి ఫోన్‌లోనే సెల్ఫీ తీసుకున్న నిందితుడు
  • నిందితుడి కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు
పుణెలో ఓ దుండగుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. డెలివరీ బాయ్ ముసుగులో ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఫోన్‌లోనే సెల్ఫీ తీసుకుని, 'మళ్లీ వస్తా' అంటూ బెదిరింపు సందేశం పంపి పరారయ్యాడు. ఈ పైశాచిక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కొంధ్వా ప్రాంతంలోని ఓ ప్రముఖ నివాస సముదాయంలో బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలైన 22 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, నిందితుడు కొరియర్ బాయ్‌నంటూ వచ్చాడు. బ్యాంకు నుంచి ఒక లెటర్ వచ్చిందని, దానిపై సంతకం చేయాలని నమ్మబలికాడు.

అయితే, తన వద్ద పెన్ను లేదని బాధితురాలు చెప్పడంతో, నిందితుడు కూడా తన దగ్గర లేదని బదులిచ్చాడు. ఆమె పెన్ను కోసం బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన వెంటనే, అతడు తలుపుకు లోపలి నుంచి గడియ పెట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలు తేరుకునేలోపే ఆమెపై ఒక రకమైన స్ప్రే చల్లి స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలింది.

కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి, తన ఫోన్ చూడగా షాక్‌కు గురైంది. అందులో నిందితుడి సెల్ఫీతో పాటు 'మళ్లీ వస్తా' అనే బెదిరింపు సందేశం ఉండటంతో భయాందోళనకు గురైంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

"నిందితుడిని పట్టుకునేందుకు పుణె పోలీసు విభాగానికి చెందిన 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి" అని డీసీపీ షిండే తెలిపారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 64, 77 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడిని గుర్తించేందుకు సొసైటీతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Pune Rape Case
Pune
Rape
Courier Boy
Maharashtra Crime
Sexual Assault
Crime News
Police Investigation
Kondhwa

More Telugu News