Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చుక్కెదురు

Jacqueline Fernandez Faces Setback in 200 Crore Money Laundering Case
  • బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
  • రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై విచారణ నిలిపివేయాలని అభ్యర్థన
  • జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
  • మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్టు ఆరోపణలు
  • ఈ కేసులో జాక్వెలిన్ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘరానా మోసగాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులో ఆమె విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

జస్టిస్ అనీశ్ దయాళ్ నేతృత్వంలోని ధర్మాసనం, అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసి, తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. సుకేశ్ నుంచి తాను అందుకున్న బహుమతులు నేరపూరిత సొమ్ముతో కొన్నవని తనకు తెలియదని జాక్వెలిన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. సుకేశ్ రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అతడిని బలిపశువును చేస్తున్నారని సహ నిందితురాలు పింకీ ఇరానీ తనను నమ్మించిందని కూడా పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును కూడా రద్దు చేయాలని ఆమె కోరారు.

అయితే, ఈడీ ఈ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఛార్జిషీటును విచారణకు స్వీకరించి, ప్రాథమికంగా కేసు నడుస్తోందని నిర్ధారించిందని గుర్తుచేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆ ఉత్తర్వులను జాక్వెలిన్ సవాలు చేయలేదని, కాబట్టి ఆమె పిటిషన్ విచారణకు అర్హం కాదని ఈడీ వాదించింది.

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ల భార్యల నుంచి సుకేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్లు మోసపూరితంగా వసూలు చేశాడన్న ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో తరలించి, షెల్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టేందుకు సుకేశ్, అతని భార్య లీనా పౌలోస్ ప్రయత్నించారని ఈడీ ఆరోపిస్తోంది. హైకోర్టు తాజా తీర్పుతో ఈ కేసులో జాక్వెలిన్‌పై విచారణ కొనసాగనుంది.
Jacqueline Fernandez
Sukesh Chandrasekhar
Money Laundering Case
Delhi High Court
Enforcement Directorate
ED
Bollywood Actress
Criminal Case
Pinky Irani
Lena Paulose

More Telugu News