Shubman Gill: ఇంగ్లండ్ గడ్డపై శుభ్ మన్ గిల్ రికార్డుల మోత

Shubman Gill Smashes Records with Double Century in England
  • ఇంగ్లండ్‌లో గిల్ చారిత్రక డబుల్ సెంచరీ.. తొలి ఆసియా కెప్టెన్‌గా రికార్డు!
  • శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రికార్డు బ్రేక్
  • దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చోటు దక్కించుకున్న యువ కెప్టెన్
భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో రోజు, గురువారం గిల్ ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాడు.

వివరాల్లోకి వెళితే, 311 బంతులను ఎదుర్కొన్న గిల్.. 21 ఫోర్లు, రెండు భారీ సిక్సర్ల సహాయంతో తన కెరీర్‌లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. జాష్ టంగ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీసి 200 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో, ఇంగ్లండ్‌లో ఒక ఆసియా కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును గిల్ అధిగమించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉండేది. దిల్షాన్ 2011లో లార్డ్స్ మైదానంలో 193 పరుగులు చేశాడు.

అంతేకాకుండా, దాదాపు 34 ఏళ్ల క్రితం మహ్మద్ అజారుద్దీన్ నెలకొల్పిన రికార్డును కూడా గిల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌లో ఒక భారత కెప్టెన్‌కు ఇదే ఇప్పటివరకు అత్యధిక స్కోరు. 1990లో మాంచెస్టర్‌లో అజారుద్దీన్ 179 పరుగులు చేయగా, ఇప్పుడు గిల్ దాన్ని దాటేశాడు.

ఈ డబుల్ సెంచరీతో గిల్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. గతంలో సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే 147 పరుగులు చేసిన గిల్, ఈ మ్యాచ్‌తో తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటాడు.

సచిన్, కోహ్లీ రికార్డు కూడా బద్దలు!

శుభ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్‌లో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించాడు.  2019లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ 254 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు గిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్ట్ స్కోరు (248 నాటౌట్)ను కూడా గిల్ అధిగమించాడు.

భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు వీరేంద్ర సెహ్వాగ్ (319) పేరిట ఉంది. ఆ తర్వాత కరుణ్ నాయర్ (303 నాటౌట్), వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (270) వంటి దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు గిల్ తన 269 పరుగుల ఇన్నింగ్స్‌తో ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాడు.
Shubman Gill
India cricket
England
double century
Test match
cricket record
Indian captain
Edgbaston
Virat Kohli
Sachin Tendulkar

More Telugu News