Pawan Kalyan: గిరిజనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మామిడి పండ్ల కానుక

Pawan Kalyan Sends Mangoes to Tribal People in Kuridi
  • అల్లూరి జిల్లా గిరిజనులపై అభిమానం చాటుకున్న పవన్ కల్యాణ్
  • కురిడి గ్రామస్థులకు తన తోటలోని మామిడి పండ్లు పంపిన డిప్యూటీ సీఎం
  • ప్రత్యేక వాహనంలో ఆర్గానిక్ పండ్లను తరలించిన సిబ్బంది
  • దాదాపు 230 గిరిజన కుటుంబాలకు పండ్ల పంపిణీ
  • పవన్ సార్ చల్లగా ఉండాలంటూ గ్రామస్థుల ఆశీస్సులు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గిరిజనులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని, ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం పరిధిలోని కురిడి గ్రామస్థుల కోసం తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను ప్రేమతో పంపించారు.

పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ సిబ్బంది గురువారం ప్రత్యేక వాహనంలో మామిడి పండ్లను కురిడి గ్రామానికి తీసుకువెళ్లారు. గ్రామంలో ఉన్న సుమారు 230 గిరిజన కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి, ప్రతి ఇంటికి అర డజను చొప్పున పండ్లను పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం స్వయంగా పంపిన పండ్లను అందుకున్న గ్రామస్థులు, ముఖ్యంగా చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. "మా పవన్ సారు పంపిన పండ్లు" అంటూ ఇష్టంగా తిన్నారు. తమపై అభిమానం చూపిన పవన్ కల్యాణ్ చల్లగా ఉండాలని వారు మనసారా ఆశీర్వదించారు.

ఇటీవల 'అడవి తల్లి బాట' కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ కురిడి గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో గ్రామస్థుల కష్టాలను అడిగి తెలుసుకుని, రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ పర్యటన సందర్భంగా ఏర్పడిన అనుబంధంతోనే ఇప్పుడు వారికి తన తోటలోని పండ్లను పంపించి తన మాటను నిలబెట్టుకున్నారు.

Pawan Kalyan
AP Deputy CM
Janasena
Kuridi Village
Alluri Sitarama Raju district
Tribal Community
Mangoes
Organic Farming
Adavi Talli Bata
Andhra Pradesh

More Telugu News