Shubman Gill: కెప్టెన్ గిల్ చారిత్రక డబుల్ సెంచరీ.. రెండో రోజూ టీమిండియాదే హవా

Shubman Gill Shines India Dominates Edgbaston Test Day 2
  • ఎడ్జ్‌బాస్టన్ టెస్టుపై పట్టు బిగించిన టీమిండియా
  • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చారిత్రక డబుల్ సెంచరీ (269)
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోరు
  • రెండో రోజు ముగిసేసరికి 77 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
  • రెండు వికెట్లతో చెలరేగిన పేసర్ ఆకాశ్ దీప్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) చారిత్రక డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బౌలింగ్‌లోనూ రాణించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ను 77 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనకంజలో ఉంది.

గురువారం రెండో రోజు ఆటలో గిల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. గిల్, జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించగా, సుందర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగుల భాగ‌స్వామ్యం అందించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా, ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ సరికొత్త రికార్డులు సృష్టించాడు.

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జ‌ట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన యువ పేసర్ ఆకాశ్ దీప్ తన వరుస బంతుల్లో బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) లను పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బ తీశాడు. కాసేపటికే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జాక్ క్రాలీ (19) కూడా ఔటవ్వడంతో 25 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు పారేసుకుని ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

చివ‌రికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జ‌ట్టు మూడు వికెట్లు కోల్పోయి 77 ప‌రుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (30 నాటౌట్), జో రూట్ (18 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతం చేస్తే తప్ప ఓటమి నుంచి గట్టెక్కడం కష్టమే.
Shubman Gill
India vs England
Edgbaston Test
Cricket
Ravindra Jadeja
Washington Sundar
Jasprit Bumrah
Akash Deep
Joe Root
Test Cricket

More Telugu News