Payyavula Keshav: పరామర్శల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు.. జగన్‌పై మంత్రి పయ్యావుల విమర్శలు

Payyavula Criticizes Jagan for Disrupting Peace in Andhra Pradesh
  • మాజీ సీఎంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు
  • అసాంఘిక శక్తులను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్న పయ్యావుల
  • జగన్ తీరు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
రాష్ట్రంలో పరామర్శల పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అరాచకాన్ని, అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే, జగన్ మాత్రం అస్థిరతను సృష్టించేందుకు అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో మంత్రి పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "గత ప్రభుత్వం ఉద్యోగుల నుంచి పాఠశాల పిల్లల భోజనాల వరకు బకాయిలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఆ వ్యవస్థను గాడిన పెట్టి, ప్రజలకు ప్రశాంతత, అభివృద్ధి, భరోసా ఇచ్చే పాలన అందిస్తున్నాం" అని తెలిపారు.

అయితే, ఈ అభివృద్ధిని అడ్డుకునేలా జగన్ వ్యవహరిస్తున్నారని పయ్యావుల మండిపడ్డారు. "పరామర్శల పేరుతో పర్యటిస్తూ, అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారు. 'రప్ప రప్ప' నరుకుతామంటే మంచిదేగా అని  వారిని వెనకేసుకొస్తున్నారు. ఆయన తీరు సమాజానికి ప్రమాదకరం" అని వ్యాఖ్యానించారు. జగన్ పోకడల పట్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పయ్యావుల ఇంటింటికీ తిరుగుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
Payyavula Keshav
Jagan Mohan Reddy
Andhra Pradesh
YS Jagan
TDP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Uravakonda
Mopidi Village
Governance

More Telugu News