Unified Lending Interface: ఇక రుణాలు కూడా యూపీఐ లాగే.. దేశంలో మరో డిజిటల్ విప్లవానికి కేంద్రం శ్రీకారం!

Unified Lending Interface ULI Aims to Transform Indian Loan System
  • భారత్‌లో రుణాల జారీలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం
  • యూపీఐ తరహాలో 'యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్' (యూఎల్‌ఐ) రూపకల్పన
  • ప్రభుత్వ డేటాను అనుసంధానించి సులభంగా రుణాలు అందించే ప్రణాళిక
  • చిరు వ్యాపారులు, సామాన్యులే లక్ష్యంగా కొత్త డిజిటల్ రుణ వ్యవస్థ
  • యూపీఐని మించిన ప్రభావం చూపిస్తుందన్న ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) తరహాలోనే, రుణాల రంగంలోనూ ఒక విప్లవాత్మక మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రుణాలు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 'యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్' (యూఎల్‌ఐ) అనే సరికొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంయుక్తంగా ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాయి.

ఏమిటీ యూఎల్‌ఐ? ఎలా పనిచేస్తుంది
యూఎల్‌ఐ అనేది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఫిన్‌టెక్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, క్రెడిట్ బ్యూరోలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. దీని ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటిని వేగంగా మంజూరు చేయడం చాలా సులభం అవుతుంది.

వినియోగదారుడి అనుమతితో వారి కేవైసీ, ఆధార్, పాన్ కార్డ్, జీఎస్టీ, ఆదాయ పన్ను రిటర్న్స్, భూ రికార్డులు, యుటిలిటీ బిల్లుల వంటి డిజిటల్ డేటాను రుణ సంస్థలు సులభంగా యాక్సెస్ చేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా, ఎలాంటి పూచీకత్తు (కొల్లేటరల్) లేదా సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్ లేకుండానే రుణాలు మంజూరు చేసేందుకు వీలవుతుంది. యూపీఐలో మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసినంత సులభంగా, భవిష్యత్తులో యూఎల్‌ఐ ద్వారా రుణాలు పొందవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రధాన లక్ష్యం ఇదే
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సులభంగా రుణాలు అందించడమే యూఎల్‌ఐ ప్రధాన లక్ష్యం. సరైన క్రెడిట్ హిస్టరీ, పూచీకత్తు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులకు ఇది ఒక వరంలా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక సేవలను దేశంలోని ప్రతి ఒక్కరికీ అందించాలనే లక్ష్యంతో, యూపీఐ స్ఫూర్తితో ఈ కొత్త వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Unified Lending Interface
ULI
UPI
digital lending
RBI
M Nagaraju
T Rabi Sankar
loan disbursal
digital payments
MSME loans

More Telugu News