Subramani: రూ.5 లక్షల కోసం దారుణం.. బంధువులను సజీవ దహనం చేసేందుకు ఇంటికి నిప్పుపెట్టిన వ్యక్తి!.. వీడియో ఇదిగో!

Bangalore Man Sets Fire to Relatives House Over 5 Lakh Rupees Debt
  • బెంగళూరులో బంధువుల మధ్య ఆర్థిక వివాదం తీవ్రరూపం
  • రూ.5 లక్షల అప్పు విషయంలో ఘర్షణ
  • ఇంట్లో మనుషులు ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి
  • సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైన దాడి దృశ్యాలు
  • అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పడంతో తప్పిన పెను ప్రమాదం
అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదన్న కోపంతో, ఇంట్లో మనుషులు ఉండగానే ఓ వ్యక్తి వారి ఇంటికి నిప్పుపెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని వివేక్‌నగర్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

వివేక్‌నగర్‌లో వెంకటరమణి, ఆమె కుమారుడు సతీశ్ నివసిస్తున్నారు. వారి బంధువైన సుబ్రహ్మణి ఈ దాడికి పాల్పడినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 7-8 ఏళ్ల క్రితం, వెంకటరమణి వద్ద బంధువైన పార్వతి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే, అప్పటి నుంచి ఆ డబ్బును తిరిగి చెల్లించలేదు. ఇటీవల ఓ కుటుంబ వివాహ వేడుకలో వెంకటరమణి మరోసారి డబ్బుల గురించి అడగటంతో ఇరు కుటుంబాల మధ్య మాటల యుద్ధం, బెదిరింపులు చోటుచేసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే జూలై 1వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో సుబ్రహ్మణి పెట్రోల్ బాటిల్‌తో వెంకటరమణి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆమె, మరో కుమారుడు మోహన్ దాస్ ఇంట్లోనే ఉన్నారు. సుబ్రహ్మణి ఇంటి ప్రధాన ద్వారం, చెప్పుల స్టాండ్, బెడ్‌రూమ్ కిటికీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాటిని ఆర్పివేయడంతో పాటు ఇంట్లో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ ఇంటి ముందు భాగం, కిటికీలు దెబ్బతిన్నాయి.

బాధితుడు సతీశ్ ఫిర్యాదు మేరకు వివేక్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, సుబ్రహ్మణి పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
Subramani
Viveknagar
Bangalore
money lending dispute
arson attack
attempted murder
family dispute
crime news
cctv footage
police investigation

More Telugu News