Nara Lokesh: మెగా డీఎస్సీ విజయవంతం.. అడ్డంకులను అధిగమించామన్న మంత్రి లోకేశ్

Nara Lokesh Says Mega DSC Successful Overcoming Obstacles
  • 23 రోజుల్లో మెగా డీఎస్సీ విజయవంతంగా పూర్తి చేశామ‌న్న మంత్రి
  • అధికారులకు అభినందనలు తెలిపిన లోకేశ్
  • కోర్టు కేసులతో అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేసిందని ఆరోపణ
  • 92.9 శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు
  • త్వరలోనే డీఎస్సీ తుది ‘కీ’ విడుదల చేస్తామని వెల్లడి
రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కేవలం 23 రోజుల వ్యవధిలోనే, అనేక అడ్డంకులను అధిగమించి ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా కుట్ర చేసిందని ఆయ‌న‌ ఆరోపించారు. మొత్తం 31 కోర్టు కేసులు వేసి ప్రక్రియను నిలిపివేయాలని చూసినప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

మెగా డీఎస్సీకి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించిందని లోకేశ్ వివరించారు. మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు చేయగా, వారిలో 92.9 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. ఎస్సీ ఉప వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి అన్ని నిబంధనలను పక్కాగా అమలు చేశామని ఆయన పేర్కొన్నారు.

ఈ మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతం చేసిన విద్యాశాఖ అధికారులందరికీ ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్‌ తన అభినందనలు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేశామని, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే తుది ‘కీ’ని కూడా విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Nara Lokesh
Mega DSC
AP DSC
Andhra Pradesh DSC
Education Minister
Teacher Recruitment
YCP Conspiracy
Education Department
AP Government Jobs
DSC Results

More Telugu News