BCCI: బంగ్లా టూర్‌కు కేంద్ర ప్రభుత్వం బ్రేక్.. సిరీస్‌పై నీలినీడలు

India Bangladesh Cricket Series Faces Uncertainty
  • ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై అనిశ్చితి
  • బంగ్లాలో రాజకీయ అశాంతి, భద్రతా కారణాలతో పర్యటనకు కేంద్రం విముఖత
  • ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడలేమని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • మీడియా హక్కుల వేలాన్ని నిలిపివేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
  • సిరీస్ వాయిదా లేదా రద్దుపై త్వరలో బీసీసీఐ, బీసీబీ సంయుక్త ప్రకటన
భారత క్రికెట్ జట్టు ఆగస్టులో చేపట్టాల్సిన బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.

త్వ‌ర‌లోనే బీసీసీఐ, బీసీబీ సంయుక్త ప్రకటన
షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 17 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, అక్కడి స్థానిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో బీసీసీఐకి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ప్రభుత్వ అనుమతి వస్తేనే జట్టును పంపుతామని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సిరీస్‌ను వాయిదా వేయడమా? లేక పూర్తిగా రద్దు చేయడమా? అనే అంశంపై బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

మీడియా హక్కుల వేలాన్ని నిలిపివేసిన బీసీబీ
మరోవైపు టీమిండియా పర్యటన రద్దయ్యే సూచనలతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలింది. ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని 2025-27 కాలానికి మీడియా హక్కుల అమ్మకానికి బీసీబీ ప్రణాళికలు సిద్ధం చేసింది. జులై 7, 10 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించాలని భావించింది. కానీ, తాజా పరిణామాలతో మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తూ బీసీబీ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో సిరీస్‌ల మాదిరిగా ఈ మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశంపైనా చర్చలు జరుగుతున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
BCCI
India vs Bangladesh
Bangladesh tour
BCB
India cricket
Bangladesh cricket
Cricket series cancelled
Political unrest
Security concerns
Media rights

More Telugu News