Pawan Kalyan: మా కుటుంబం కనిగిరిలో ఉండలేకపోయింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan My Family Could Not Live in Kanigiri
  • ప్రకాశం జిల్లా కష్టాలపై స్పందించిన పవన్ కల్యాణ్
  • చిన్నప్పుడు రెండేళ్లు ఇక్కడే ఉన్నానన్న ఉప ముఖ్యమంత్రి
  • కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండేదని వెల్లడి
  • ఫ్లోరైడ్ భయంతో ఆరు నెలలకే ఊరు వదిలి వెళ్లామన్న పవన్
  • అప్పటి నుంచి ఇప్పటికీ తాగునీటి సమస్య ఉండటంపై ఆవేదన
  • మార్కాపురంలో తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన
ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆ సమస్య తీవ్రత తనకు బాగా తెలుసని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటిని అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్టును మార్కాపురంలో రూ.1,290 కోట్లతో చేపడుతున్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ,"నా చిన్నప్పుడు సుమారు రెండేళ్ల పాటు ఈ ప్రకాశం జిల్లాలోనే ఉన్నాను. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో నివసించేవాళ్లం. అక్కడి నీటిలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దానివల్ల మోకాళ్లు, వెన్నెముకలు వంగిపోయే ప్రమాదం ఉందని తెలియడంతో, కేవలం 6 నెలల్లోనే మా కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్లిపోయింది" అని పవన్ వివరించారు.

అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య కొనసాగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ సమస్య కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఈ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను ఎదుర్కొన్న సమస్యను ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పరిష్కరించే అవకాశం రావడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
Pawan Kalyan
Prakasam District
Drinking Water
Fluoride Problem
Kanigiri
Andhra Pradesh
Water Project
Markapuram
Deputy Chief Minister

More Telugu News