Pawan Kalyan: తాటాకు చప్పుళ్లకు భయపడం.. 2029లో మీరెలా వస్తారో చూస్తాం: వైసీపీకి పవన్ వార్నింగ్

Pawan Kalyan Warns YSRCP on Threats and Rowdyism
  • మార్కాపురంలో రూ.1,290 కోట్ల తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన
  • రంపాలు, కుత్తుకలంటూ బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టీకరణ
  • గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం ఆలోచనలు ఉన్నాయని ఆరోపణ
  • సామాన్యులను భయపెడితే సహించేది లేదని తేల్చిచెప్పిన పవన్
రంపాలు తెస్తాం, కుత్తుకలు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గత పాలకుల్లో ఇంకా రౌడీయిజం, గుండాయిజం చేయాలన్న ఆలోచనలు కనిపిస్తున్నాయని, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో శుక్రవారం రూ.1,290 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ప్రస్తుతం 11 సీట్లు గెలిచిన మీకు మేం గౌరవం ఇస్తున్నాం. మా పాలనలో ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరిచేసుకుంటాం. అంతేగానీ, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం" అని అన్నారు.

గతంలో వైసీపీకి 151 సీట్లు వచ్చి, తాను రెండు చోట్లా ఓడిపోయినప్పుడే ధైర్యంగా నిలబడి పోరాడామని పవన్ గుర్తుచేశారు. "అలాంటి మమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంత దమ్ము కావాలో ఆలోచించండి. ఇప్పుడు 2029లో మా అంతు చూస్తామంటున్నారు. అసలు అప్పటికి మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం" అంటూ సవాల్ విసిరారు. తనకు వైసీపీలో ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత కక్షలు లేవని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
Pawan Kalyan
YSCP
Pawan Kalyan warning
Andhra Pradesh politics
Markapuram
drinking water project
Praksam district
political challenge
TDP Janasena alliance
2029 elections

More Telugu News