Abbayya Choudary: త్వరలోనే 2.0 వెర్షన్ చూపిస్తా: అబ్బయ్య చౌదరి

YSRCP Leader Abbayya Choudary Criticizes TDP in Denduluru
  • తన మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దన్న అబ్బయ్య చౌదరి
  • వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని మండిపాటు
  • తనను రాజకీయంగా తప్పించాలని చూస్తున్నాని ఆగ్రహం
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత అబ్బయ్య చౌదరి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దని, రానున్న రోజుల్లో "అబ్బయ్య చౌదరి 2.0" చూపిస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో "చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ" పేరుతో నిర్వహించిన వైసీపీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతలు వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనవసరమైన కేసులు, కొట్లాటలతో వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని ఆయన అన్నారు.

దెందులూరులో తనను రాజకీయంగా తప్పిస్తే చక్రం తిప్పవచ్చని కొందరు భ్రమల్లో ఉన్నారని, అది జరగదని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తాను ఏ ఒక్కరికీ బాకీ లేనని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో దెందులూరులో 167 జగనన్న కాలనీలు నిర్మించామని, ప్రస్తుత ప్రభుత్వానికి దమ్ముంటే 168వ కాలనీని నిర్మించి చూపించాలని సవాల్ విసిరారు. కొల్లేరులో అభివృద్ధి ఎవరు చేశారో బహిరంగ చర్చకు రావాలని ఆయన అన్నారు. 
Abbayya Choudary
Denduluru
YSRCP
Andhra Pradesh Politics
Chandrababu Naidu
Kutra government
Botsa Satyanarayana
Jagananna Colonies

More Telugu News