Bandi Sanjay: 50 ఏళ్లలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా?: కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Fires at Congress Over BC Leadership
  • రాష్ట్ర కేబినెట్ లో బీసీలకు తగినన్ని మంత్రి పదవులు ఇవ్వలేదని విమర్శ
  • ఆరు గ్యారెంటీల అమలులో విఫలమయ్యారని మండిపాటు
  • ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సభపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సభ పేరును ‘సామాజిక అన్యాయ సమర భేరి’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఏ అర్హతతో కాంగ్రెస్ పార్టీ సమర భేరి నిర్వహిస్తోందని ఆయన నిలదీశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, "50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీ నేతకైనా ప్రధాని పదవి ఇచ్చిందా? కనీసం ఒక్క బీసీనైనా ముఖ్యమంత్రిని చేసిందా?" అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు కేబినెట్‌లో ఎన్ని మంత్రి పదవులు కేటాయించారని ఆయన నిలదీశారు. పొన్నం ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో బీసీల గొంతు వినిపిస్తోందని, అలాంటప్పుడు మిగతా బీసీలకు ఎందుకు అవకాశమివ్వలేదని అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో యూరియా కొరత అంశంపై కూడా బండి సంజయ్ స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత పేరుతో డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం అడిగిన దానికంటే అదనంగా యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని ఆయన కోరారు.

Bandi Sanjay
Congress Party
BC leader
Telangana politics
BJP
ponnam prabhakar
urea shortage
Tumala Nageswara Rao
central government
social injustice

More Telugu News