Microsoft: పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!

Microsoft Exits Pakistan Ending 25 Year Operations
  • పాకిస్థాన్ లో కార్యకలాపాలను నిలిపివేసిన మైక్రోసాఫ్ట్
  • అధికారిక ప్రకటన లేకుండానే సేవలు బంద్
  • రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం కారణం కావచ్చంటున్న నిపుణులు
ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ ‌లో సుమారు 25 ఏళ్లుగా కొనసాగుతున్న తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే జూలై 3 నుంచి ఆ దేశం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. ఈ పరిణామం పాక్ టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ చీఫ్‌గా ఉన్న జావాద్ రెహ్మాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిని 'ఒక యుగానికి ముగింపు'గా ఆయన అభివర్ణించారు. 2000వ సంవత్సరం మార్చి 7న పాక్‌లో అడుగుపెట్టిన మైక్రోసాఫ్ట్, సరిగ్గా 25 ఏళ్ల తర్వాత తన సేవలను ముగించింది.

మైక్రోసాఫ్ట్ అధికారికంగా కారణాలు చెప్పనప్పటికీ, ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వాణిజ్యానికి అనుకూల పరిస్థితులు లేకపోవడమే ఈ నిర్ణయానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పాక్ వాణిజ్య లోటు 24.4 బిలియన్ డాలర్లకు చేరగా, విదేశీ మారక నిల్వలు 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. వీటికి తోడు, పాకిస్థాన్ లో నైపుణ్యం కలిగిన టెక్ నిపుణుల కొరత కూడా కంపెనీల నిష్క్రమణకు ఒక కారణంగా చెబుతున్నారు.

ఒకవైపు పాకిస్థాన్ లో ఈ పరిస్థితి ఉండగా... మరోవైపు భారత్ టెక్ రంగంలో ప్రపంచానికి గమ్యస్థానంగా మారుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థిరమైన ప్రభుత్వం, పెట్టుబడులకు అనుకూల విధానాలు ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. 
Microsoft
Microsoft Pakistan
Pakistan
Economic Crisis
Political Instability
Tech Industry
Jawed Rehman
Foreign Exchange Reserves
India Tech Industry

More Telugu News