Buchi Ramprasad: దమ్ముంటే బ్రాహ్మణ సంక్షేమంపై చర్చకు రావాలి: వైసీపీ నేతలకు బుచ్చి రాంప్రసాద్ సవాల్

Buchi Ramprasad Challenges YSRCP Leaders on Brahmin Welfare Debate
  • గత ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగాయని తీవ్ర విమర్శలు
  • ప్రసాదాల్లో బొద్దింకలు, మేకులు పెట్టి వైసీపీ నేతలు కుట్రలు పన్నారని ఆరోపణ
  • కూటమి పాలనలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 340 కోట్ల కేటాయింపు
  • ఆలయాల జోలికి వస్తే ఉన్న 11 సీట్లు కూడా దక్కవని తీవ్ర హెచ్చరిక
బ్రాహ్మణులకు ఏ ప్రభుత్వం మేలు చేసిందో బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? అని టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల పాలనలో బ్రాహ్మణులకు ఒరగబెట్టిందేమీ లేకపోగా, పవిత్ర దేవాలయాలపై దాడులు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి, బ్రాహ్మణుల సంక్షేమం జరుగుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ పాలనలో దేవాలయాలపై కుట్రలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై వ్యవస్థీకృతంగా దాడులు జరిగాయని బుచ్చిరాంప్రసాద్ ఆరోపించారు. "శ్రీశైలం ప్రసాదంలో వారే బొద్దింకలు పెట్టి గొడవ చేశారు. విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకుల పేరుతో రచ్చ చేశారు. తిరుమల క్యూలైన్లలో గొడవలు సృష్టించి దొరికిన వ్యక్తి వైసీపీ కార్యకర్త బొద్దిలి అచ్చారావు అని విచారణలో తేలింది. ఇవన్నీ దేవాలయాల ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలో భాగమే" అని అన్నారు.

రామతీర్థంలో రాములవారి విగ్రహంపై దాడి, అంతర్వేదిలో రథం దహనం, దుర్గమ్మ వెండి సింహాల అపహరణ వంటి ఘటనలను ఆయన గుర్తుచేశారు. "వైసీపీ నాయకులు దుర్గమ్మ చెంత దుర్మార్గాలు, అప్పన్న చెంత అరాచకాలు, మల్లన్న వద్ద మూర్ఖపు పనులు చేశారు. వారి పాపాలు పండే ఈ ఎన్నికల్లో ప్రజలు చాచి కొట్టినా వారికి బుద్ధి రాలేదు" అని విమర్శించారు. 2019 మేనిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమం అనే మాటే లేదని, ధూపదీప నైవేద్యాల నిధులు పెంచుతామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నరలోనే బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని బుచ్చిరాంప్రసాద్ వివరించారు. "బ్రాహ్మణ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. 340 కోట్లు కేటాయించాం. ధూపదీప నైవేద్యం పథకం కింద 50 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు నెలకు రూ. 10 వేలు, 50 వేల పైగా ఆదాయం ఉన్న ఆలయాల్లోని అర్చకులకు రూ. 15 వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు జీవో విడుదల చేశాం" అని తెలిపారు.

వేదం చదివే ప్రతి విద్యార్థికి రూ. 3 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామని, అపరకర్మలు చేసే వారి కోసం ప్రతి నియోజకవర్గంలో ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు, ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులతో పాటు నాయి బ్రాహ్మణులకు కూడా సభ్యత్వం కల్పించే ప్రక్రియ మొదలైందని స్పష్టం చేశారు. పురోహితులు, వంట బ్రాహ్మణులను కులవృత్తుల కింద గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆలయాల జోలికి రావొద్దని హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న 11 సీట్లు కూడా దక్కవని బుచ్చిరాంప్రసాద్ తీవ్రంగా హెచ్చరించారు.
Buchi Ramprasad
YSRCP
TDP
Brahmin welfare
Andhra Pradesh temples
Temple attacks
Dhoopa Deepa Naivedyam
Brahmin Corporation
Coalition government
Hindu temples

More Telugu News