Artificial Intelligence: 'ఏఐ' అద్భుతం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్‌తో యువకుడిని కాపాడిన పోలీసులు

AI Saves Youth Uttar Pradesh Police Alerted by Artificial Intelligence
  • ప్రేమ విఫలమై ఆత్మహత్యకు యత్నించిన ఉత్తరప్రదేశ్ యువకుడు
  • ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుతో అప్రమత్తమైన మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  • ఉత్తరప్రదేశ్ పోలీసులకు మెటా నుంచి అత్యవసర హెచ్చరిక
  • 15 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలు కాపాడిన పోలీసులు
  • మెటా హెచ్చరికలతో ఇప్పటివరకు 1107 మందిని కాపాడినట్లు వెల్లడి
సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, కొన్ని సందర్భాలలో ప్రాణాలను కూడా కాపాడుతుందని నిరూపితమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడబోతుండగా, మెటా సంస్థకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్రమత్తం చేయడంతో పోలీసులు అతడిని రక్షించారు. ఈ సంఘటన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మానవ ప్రాణాలను ఎలా కాపాడవచ్చో తెలియజేస్తోంది.

వివరాల్లోకి వెళితే, అజంగఢ్‌కు చెందిన 19 సంవత్సరాల యువకుడు తన ప్రియురాలు మోసం చేసిందంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె మరొకరిని వివాహం చేసుకోబోతోందని, పైగా తనను బెదిరిస్తోందని ఆవేదన చెందాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం తెల్లవారుజామున ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్టును మెటా సంస్థకు చెందిన ఏఐ వ్యవస్థ గుర్తించి వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి హెచ్చరిక పంపింది. అప్రమత్తమైన పోలీసులు యువకుడి మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేసి, కేవలం 15 నిమిషాల్లోనే అతడి ఇంటికి చేరుకున్నారు. వారు వెళ్లేసరికి ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యుల సహాయంతో అడ్డుకుని రక్షించారు.

అనంతరం, ఆ యువకుడికి, అతని కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు. 2023 జూలై నుండి ఇప్పటివరకు ఇలాంటి మెటా హెచ్చరికల ద్వారా సుమారు 1,107 మంది ప్రాణాలను కాపాడినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ సందర్భంగా వెల్లడించారు.
Artificial Intelligence
AI
Uttar Pradesh Police
Suicide Prevention
Meta AI
Instagram

More Telugu News