Nara Lokesh: పది తర్వాత చదువు ఆపొద్దు... ప్రతి విద్యార్థి కాలేజీలో చేరాలి: మంత్రి లోకేశ్

Nara Lokesh Orders 10th Pass Students Enrollment in Colleges
  • చదువు మానేసి ఎవరూ ఇంట్లో ఉండకూడదని మంత్రి లోకేశ్ ఆదేశం
  • ప్రతి విద్యార్థి ఎక్కడ చేరారో ట్రాక్ చేయాలని అధికారులకు సూచన
  • ఆగస్టు 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ప్రారంభం
  • యూడైస్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం
  • ప్రత్యేక అవసరాల విద్యార్థులకు మార్కుల విధానంలో కీలక మార్పులు
పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు మానేయకుండా, ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఇంటర్మీడియట్ విద్యపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి ఎక్కడ, ఏ కోర్సులో ప్రవేశం పొందారో కచ్చితంగా ట్రాక్ చేయాలి. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖతో సమన్వయం చేసుకుని పక్కాగా వివరాలు నమోదు చేయాలి" అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,00,965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని అధికారులు మంత్రికి వివరించారు. యూడైస్ (UDISE) నమోదు ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి సూచించారు.

రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించే లక్ష్యంతో ఆగస్టు 7వ తేదీ నుంచి 'అక్షర ఆంధ్ర' (ప్రాజెక్ట్ అఆ) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు ఈ సమావేశంలో తెలిపారు.

అదేవిధంగా, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు ఇబ్బందులు లేకుండా, వారికి భాషా సబ్జెక్టుల మార్కులను మిగిలిన సబ్జెక్టుల మార్కుల సగటుగా పరిగణించాలని మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Education
Intermediate Education
Literacy Mission
Akshara Andhra
UDISE
Kona Sasidhar
Kritika Shukla
IIT NIT Admissions
Vocational Courses

More Telugu News