Hyderabad: హైదరాబాద్‌లో నైజీరియన్ల కొత్త దందా.. వీసా కోసం పేదింటి అమ్మాయిలతో పెళ్లిళ్లు!

Nigerian Scams in Hyderabad Contract Marriages for Visa
  • పేద యువతులను లక్ష్యంగా చేసుకుని కాంట్రాక్ట్ పెళ్లిళ్లు
  • వీసా గడువు ముగిశాక దేశంలో ఉండేందుకే ఈ ఎత్తుగడ
  • డ్రగ్స్, సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాల పనేనని అనుమానం
  • గతంలో గల్ఫ్ షేక్‌ల తరహాలోనే ఇప్పుడు నైజీరియన్ల దందా
  • ఆధారాల సేకరణలో పోలీసులు
హైదరాబాద్ నగరంలో విదేశీయులు పాల్పడుతున్న మోసాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో గల్ఫ్ షేక్‌లు పేద యువతులను పెళ్లిళ్ల పేరుతో వంచించిన తరహాలోనే ఇప్పుడు కొందరు నైజీరియన్లు కాంట్రాక్ట్ వివాహాల దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లో చట్టవిరుద్ధంగా నివసించేందుకే వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

విద్య, వ్యాపారం పేర్లతో నగరానికి వస్తున్న కొందరు నైజీరియన్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీసా గడువు తీరిపోయాక, ఇక్కడే ఉండిపోయేందుకు వినూత్న ఎత్తుగడలు వేస్తున్నారు. స్థానికులతో చిన్నపాటి గొడవలు పడటం, డ్రగ్స్ కేసుల్లో ఉద్దేశపూర్వకంగా పట్టుబడటం వంటివి చేసి, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘కాంట్రాక్ట్ పెళ్లిళ్ల’ను ఒక అస్త్రంగా వాడుతున్నట్లు స్పష్టమైంది.

అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో దళారుల ద్వారా పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దలకు డబ్బు ఆశ చూపి, వారి ఇంట్లోని యువతులను పెళ్లి చేసుకుంటున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ యువతులను వదిలేసి వెళ్లిపోతున్నారు. రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఉంటూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. డబ్బుకు ఆశపడి ఈ ఒప్పంద వివాహాలకు అంగీకరిస్తున్న యువతుల జీవితాలు అంధకారంలోకి వెళ్తున్నాయి. ఈ తరహా మోసాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పోలీసులు, ఈ దందాల వెనుక ఉన్న ముఠాలను పట్టుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.
Hyderabad
Nigerian Scams
Contract Marriages
Visa Fraud
Cyber Crimes
Drug Smuggling
Police Investigation
Foreigners in Hyderabad
Illegal Activities
Fake Marriages

More Telugu News