Dengue Vaccine: డెంగ్యూపై పోరులో కీలక ముందడుగు.. త్వరలో అందుబాటులోకి టీకా!

Tetravax DV Dengue Vaccine Clinical Trial Update
  • తుది ప్రయోగాల దశకు భారత్ సొంత డెంగ్యూ వ్యాక్సిన్  
  • 'టెట్రావ్యాక్స్-డీవీ' టీకా‌ను అభివృద్ధి చేసిన  సీరమ్ ఇనిస్టిట్యూట్  
  • నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుంచి సమర్థవంతంగా రక్షణ
  • దేశవ్యాప్తంగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపు పూర్తి
  • ఏడాదిలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం
దేశంలో ఏటా వర్షాకాలంలో లక్షలాది మందిని వణికిస్తున్న డెంగ్యూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగాలు విజయవంతమైతే, ఏడాదిలోగా ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రఖ్యాత ఫార్మా సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ‘టెట్రావ్యాక్స్-డీవీ’ పేరుతో రూపొందించిన ఈ టీకా నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడో దశ క్లినికల్ ప్రయోగాలు దేశవ్యాప్తంగా 20కి పైగా కేంద్రాల్లో జరుగుతున్నాయి. 2023లో ప్రారంభమైన ఈ ప్రయోగాల్లో భాగంగా చిన్నారులు, పెద్దలతో కలిపి మొత్తం 10,000 మందికి పైగా వలంటీర్లను ఎంపిక చేశారు. ఈ నమోదు ప్రక్రియ దాదాపు పూర్తయినట్టు సమాచారం.

ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారా వ్యాపించే డెంగ్యూ కారణంగా తీవ్రమైన జ్వరం, కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో, కొత్త వ్యాక్సిన్ డెంగ్యూ కేసులను, ఆసుపత్రులలో చేరే వారి సంఖ్యను, మరణాలను గణనీయంగా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న వలంటీర్ల ఆరోగ్యాన్ని నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత ఫలితాలు ఆశాజనకంగా ఉంటే భారత ఆరోగ్య అధికారుల నుంచి వ్యాక్సిన్‌కు అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది.
Dengue Vaccine
Serum Institute of India
SII
Tetravax-DV
Dengue fever
Clinical trials
India dengue
Efficacy
Vaccine development
Health

More Telugu News