PM Modi: అర్జెంటీనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతం

PM Narendra Modi Arrives in Argentina Receives Warm Welcome
  • అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
  • బ్యూనస్ ఎయిర్స్‌లో ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
  • 'మోదీ-మోదీ' నినాదాలతో హోరెత్తించిన హోటల్ ప్రాంగణం
  • 57 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు వెళ్లిన భారత ప్రధాని
అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. బ్యూనస్ ఎయిర్స్‌లోని అల్వియర్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్న ఆయనకు అక్కడి ప్రవాస భారతీయులు 'మోదీ-మోదీ', 'జై హింద్', 'భారత్ మాతా కీ జై' నినాదాలతో బ్రహ్మరథం పట్టారు. దీంతో హోటల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రవాసులు సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ అక్కడి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. చాలా మంది ఆయన నుంచి ఆటోగ్రాఫ్‌లు అందుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. అంతకుముందు ఎజీజా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి అర్జెంటీనా ప్రభుత్వం లాంఛనప్రాయ స్వాగతం పలికింది.

ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. దాదాపు 57 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. "అర్జెంటీనాతో సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్‌లో అడుగుపెట్టాను. అధ్యక్షుడు జేవియర్ మిలీతో సమావేశమై, విస్తృతంగా చర్చలు జరపడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పేర్కొన్నారు.

రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా మోదీ అర్జెంటీనా జాతీయ నేత‌ జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అధ్యక్షుడు మిలీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. 2019లో భారత్-అర్జెంటీనా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి. వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వంటి పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతోంది.
PM Modi
Argentina visit
Indian diaspora
Buenos Aires
Javier Milei
India Argentina relations
Strategic partnership
Trade Defence Agriculture
Green Energy

More Telugu News