Donald Trump: వివాదాస్పద బిల్లుకు ట్రంప్ ఆమోదం.. గెలుపు సంబరాల మధ్య పేదలపై వేటు!

Donald Trump Approves Controversial Bill Amid Celebrations
  • వైట్‌హౌస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మధ్య కీలక బిల్లుపై ట్రంప్ సంతకం
  • పన్నుల తగ్గింపు, సైనిక వ్యయం పెంపునకు చట్టంలో ఆమోదం
  • వలసదారుల బహిష్కరణ కార్యక్రమానికి భారీగా నిధులు కేటాయింపు
  • పేదల ఆరోగ్య పథకం ‘మెడికేడ్’కు చరిత్రలో లేనంతగా కోతలు
  • సుమారు 1.7 కోట్ల మంది ఆరోగ్య బీమా కోల్పోయే అవకాశం
  • విమర్శలను కొట్టిపారేసిన అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ఓ కీలక, వివాదాస్పద బిల్లుపై సంతకం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైట్‌హౌస్‌లో నిన్న అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఈ చట్టానికి ఆమోదముద్ర వేశారు. స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్ల ఫ్లై-బై విన్యాసాల మధ్య జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్ తనదైన శైలిలో ప్రసంగించారు.

అమెరికా మునుపెన్నడూ లేనంతగా గెలుస్తోంది, గెలుస్తూనే ఉందని రిపబ్లికన్ చట్టసభ సభ్యుల మధ్య ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఒకే ఒక్క భారీ అందమైన బిల్లు’గా ఆయన అభివర్ణించిన ఈ చట్టం ద్వారా, తన మొదటి విడత పాలనలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను పొడిగించారు. అదే సమయంలో సైనిక వ్యయాన్ని భారీగా పెంచి, వలసదారుల బహిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి వైట్‌హౌస్ బాల్కనీ నుంచి ఆయన సైనిక విన్యాసాలను వీక్షించారు.

ఈ చట్టంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, మరోవైపు తీవ్ర ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, తక్కువ ఆదాయ వర్గాల కోసం 1960లలో ప్రారంభమైన ‘మెడికేడ్’ ఆరోగ్య కార్యక్రమానికి ఈ బిల్లు చరిత్రలో లేనంతగా కోతలు విధించనుంది. దీంతోపాటు ఆహార సహాయ పథకాల నిధులను కూడా గణనీయంగా తగ్గించనుంది.

ఈ కోతల కారణంగా సుమారు 1.7 కోట్ల మంది ప్రజలు తమ ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉందని, అనేక గ్రామీణ ఆసుపత్రులు మూతపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు. "ప్రతిపక్షాలు ఎప్పుడూ ప్రమాదం, అందరూ చనిపోతారు అంటూ ఒకే రకమైన విమర్శలు చేస్తాయి. కానీ వాస్తవం అందుకు పూర్తిగా విరుద్ధం" అని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో పాల్గొన్న పైలట్లను కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడం గమనార్హం.
Donald Trump
Trump bill
US bill
Medicaid
Healthcare
US Economy
Military spending
Immigration
US politics
Melania Trump

More Telugu News