KTR: రేవంత్ కు బేసిన్ లు తెలియదు... బెండకాయలు తెలియదు: కేటీఆర్

KTR Criticizes Revanth Reddys Comments and Governance
  • రైతు సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్
  • సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్
  • అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు తాము వస్తామని, చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు 72 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి బేసిన్‌ల గురించి గానీ, ప్రాజెక్టుల గురించి గానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల వాటాలో అన్యాయం జరగడం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం రైతుబంధును నాట్లు వేసే సమయంలో ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వచ్చే ముందు రైతు భరోసా ఇస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు రైతులకు ఎకరానికి 19 వేల రూపాయలు ఎగ్గొట్టి అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు కోవర్ట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. ఆ ఎమ్మెల్యే చాలా కరెక్టుగా చెప్పారని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. తాము కల్పించిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటూ సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.

సీఎం తన సభల్లో బూతులు మాట్లాడుతూ రంకెలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. చర్చకు కేసీఆర్ అవసరం లేదని, తామే చాలని అన్నారు. మందబలంతో కాకుండా 10-15 మందితోనే ప్రెస్‌క్లబ్‌కు వస్తామని, మీడియా ముందే అన్ని విషయాలు తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు. 
KTR
Revanth Reddy
Telangana
BRS
Congress
Rythu Bandhu
Irrigation Projects
Telangana Politics
KCR
Farmer Issues

More Telugu News