Mysore: మైసూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి సెల్ఫీ!

Mysore Man stabs woman puts mangalsutra takes selfie
  • ప్రేమను నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి
  • రక్తపు మడుగులో పడివున్న యువతికి తాళి కట్టి సెల్ఫీ
  • ఆసుపత్రిలో చేర్పించి పరారైన నిందితుడు
  • చికిత్స పొందుతూ బాధితురాలు మృతి
ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్ప‌డిన‌ ఘటన కర్ణాటకలోని మైసూరులో తీవ్ర కలకలం రేపింది. తాను ప్రేమించిన యువతి అంగీకరించలేదన్న కోపంతో ఆమెపై కత్తితో దాడి చేసి, రక్తపు మడుగులో పడివున్న ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకుని పైశాచికంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాండవపురానికి చెందిన ఓ యువతిని అభిషేక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను కలిసి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, తన జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అభిషేక్, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు.

ఆ దాడికి యువతి స్పృహతప్పి కిందపడిపోగా, అంతటితో ఆగని ఆ ఉన్మాది.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమె మెడలో తాళి కట్టి, ఓ సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం అతడే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు అభిషేక్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
Mysore
Abhishek
Mysore crime
Karnataka crime
Love crime
Stabbing incident
Girl murdered
Pandavapura
Crime news
Karnataka news
Obsessive lover

More Telugu News