Mona Bugalia: పోలీసు పరీక్ష ఫెయిల్.. రెండేళ్ల పాటు ఎస్సైగా పోలీస్ అకాడమీ శిక్షణ!

Mona Bugalia Failed Police Exam Trained as SI for 2 Years
  • పోలీసు పరీక్ష తప్పినా ఎస్సైగా నమ్మించిన యువతి
  • నకిలీ పత్రాలతో రాజస్థాన్ పోలీసు అకాడమీలో చేరిక
  • రెండేళ్ల పాటు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మోసం
  • ఏడాదిగా పరారీలో ఉన్న యువతిని అరెస్టు చేసిన పోలీసులు
  • కుటుంబాన్ని మెప్పించడానికే ఈ నాటకమని వెల్లడి
రాజస్థాన్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. పోలీసు ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకున్నా, నకిలీ పత్రాలతో ఏకంగా రెండేళ్ల పాటు ఓ యువతి పోలీసు అకాడమీలో శిక్షణ పొందింది. ఏడాదిగా పరారీలో ఉన్న ఆమెను తాజాగా అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం, నాగోర్ జిల్లాకు చెందిన మోనా బుగాలియా 2021లో ఎస్సై పరీక్ష రాసి విఫలమైంది. అయినప్పటికీ, మూలీదేవిగా పేరు మార్చుకుని తానే పరీక్షలో నెగ్గినట్లు నకిలీ పత్రాలు సృష్టించింది. తాను స్పోర్ట్స్ కోటాలో పాత బ్యాచ్ అభ్యర్థినని చెప్పి కొత్తగా ఎంపికైన ఎస్సైల వాట్సాప్ గ్రూపులో చేరింది. ఆ తర్వాత నేరుగా పోలీసు అకాడమీలోకి ప్రవేశించి అందరినీ నమ్మించింది.

ఆమె అకాడమీలో రెండేళ్ల పాటు సాధారణ ట్రైనీ ఎస్సైగానే వ్యవహరించింది. ఔట్‌డోర్ డ్రిల్స్‌తో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంది. ఉన్నతాధికారులతో కలిసి ఫొటోలు దిగడమే కాకుండా, ఒక సందర్భంలో ఐపీఎస్ అధికారుల సమక్షంలోనే ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సామాజిక మాధ్యమాల్లో స్ఫూర్తిదాయక కథనాలు పోస్ట్ చేస్తూ నిజమైన అధికారిణిగా చలామణి అయింది.

అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన తోటి ట్రైనీ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన మోనా, కుటుంబ సభ్యులను మెప్పించేందుకు, పోలీసు ఉద్యోగంతో వచ్చే గౌరవం, సౌకర్యాల కోసమే ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట వెల్లడించింది. పోలీసులు ఆమె నివాసం నుంచి నకిలీ పత్రాలు, రూ.7 లక్షల నగదు, పోలీసు అకాడమీ ప్రశ్నపత్రాలు, మూడు నకిలీ యూనిఫామ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
Mona Bugalia
Rajasthan Police
Police Academy
Fake documents
SI Exam
Police training

More Telugu News