Ramesh Babu: చిత్తూరులో నకిలీ వైద్యుడి కలకలం

Ramesh Babu Fake Doctor Racket Exposed in Chittoor
  • కార్డియాలజిస్ట్‌గా అవతారమెత్తిన కాంపౌండర్
  • అర్ధాంగి ఫిర్యాదుతో నకిలీ వైద్య నిపుణుడి బండారం వెలుగులోకి..
  • పోలీస్ కేసు నమోదుతో పరారీలో నకిలీ డాక్టర్ రమేశ్ బాబు
వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానం అని దాని అర్థం. కానీ, కొందరు వ్యక్తులు వైద్య వృత్తిని కూడా అవహేళన చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు నకిలీ వస్తువులు, మందులను మాత్రమే చూశాం, కానీ తాజాగా నకిలీ వైద్యులు కూడా పుట్టుకొస్తున్నారు. ఎంబీబీఎస్ చదివినట్లు బిల్డప్ ఇవ్వడమే కాకుండా ఏకంగా తెల్ల కోటు వేసుకుని వైద్యం చేస్తున్నారు. అది కూడా ఓ పేరున్న ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు)గా పని చేయడం ఆశ్చర్యకరం. దాదాపు ఐదేళ్లు ఈ నకిలీ డాక్టర్ కార్డియాలజిస్ట్‌గా పని చేసినా ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.

చిత్తూరులో ఐదేళ్లుగా కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్న ఈ నకిలీ వైద్యుడి బాగోతం ఇటీవల బయటపడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లెకు చెందిన వీరాంజనేయులు పదేళ్ల క్రితం ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత గుంటూరులోని పలు ఆసుపత్రుల్లో కాంపౌండర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత డాక్టర్‌గా అవతారం ఎత్తి పలు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆ విషయం బయటకు తెలిసి కేసులు నమోదు కావడంతో తన మకాం చిత్తూరుకు మార్చాడు.

అక్కడ తన పేరు డాక్టర్ రమేశ్ బాబుగా మార్చుకుని చిత్తూరు నగరంలోని ఏకే అమ్మా ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా చేరిపోయాడు. రెండేళ్ల క్రితం ఆసుపత్రి యాజమాన్యంతో తలెత్తిన విభేదాలతో అక్కడ మానేసి సంతపేటలో ఉన్న లైఫ్ లైన్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా చేరాడు. అయితే, ఏడేళ్ల క్రితం వీరాంజనేయులు అలియాస్ డాక్టర్ రమేశ్ బాబును పెళ్లాడిన మహిళ అదనపు కట్నం కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

భర్తపై అనుమానం వచ్చి ఆమె విచారించగా, అసలు రమేశ్ బాబు డాక్టరే కాదని, ఎంతో మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో గుంటూరులో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ నకిలీ వైద్యుడి బాగోతం వెలుగులోకి రావడంతో అతను పరారయ్యాడు. అయితే, కార్డియాలజిస్ట్ నంటూ వచ్చిన వ్యక్తి సర్టిఫికెట్లు పరిశీలించకుండా, వివరాలు తెలుసుకోకుండా ఆసుపత్రిలో ఎలా ఉద్యోగం ఇచ్చారో వైద్యాధికారులకు అంతుపట్టడం లేదు.

ఇప్పుడు నకిలీ డాక్టర్ రమేశ్ బాబు వ్యవహారం స్థానిక ఆసుపత్రి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంత గుడ్డిగా ఉద్యోగం ఇచ్చిన ఆసుపత్రుల యాజమాన్యాలది కూడా నేరమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎంహెచ్‌వో సుధారాణి మీడియాకు తెలిపారు. మరోవైపు గుంటూరు జిల్లా పోలీసులు సదరు నకిలీ వైద్య నిపుణుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
Ramesh Babu
Fake doctor
Chittoor
Cardiologist
AK Amma Hospital
Life Line Hospital
Fraud
Guntur
Sudharani DMHO
Andhra Pradesh

More Telugu News