South Kolkata Law College Gang Rape: లా కాలేజీ గ్యాంగ్‌రేప్: విద్యార్థినిపై అఘాయిత్యం తర్వాత అక్కడే మద్యం తాగిన నిందితులు!

South Kolkata Law College Gang Rape Accused Drank Alcohol After Assault
  • అనంతరం ధాబాకు వెళ్లి భోజనం చేసి ఉదయాన్నే ఇళ్లకు
  • పలుకుబడి ఉన్నవారి సాయం కోసం ప్రధాన నిందితుడి విఫలయత్నం
  • నోరు మెదపొద్దంటూ సెక్యూరిటీ గార్డును బెదిరించిన వైనం
  • సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీకి 8 వరకు పోలీస్ కస్టడీ పొడిగింపు
  •  రేపటి నుంచి కఠిన నిబంధనలతో లా కాలేజీ పునఃప్రారంభం
సౌత్ కలకత్తా లా కాలేజీలో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా గంటల తరబడి కాలేజీ ప్రాంగణంలోనే గడిపినట్టు తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి స్నేహితులు తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం జూన్ 25న ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితులు ముగ్గురూ కొన్ని గంటల పాటు కాలేజీలోని సెక్యూరిటీ గార్డు గదిలోనే ఉన్నారు. అక్కడే మద్యం తాగి, ఆపై ఈఎం బైపాస్‌లోని ఓ ధాబాకు వెళ్లి భోజనం చేశారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని బెదిరించి, మరుసటి రోజు ఉదయం తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు.

పరిస్థితి తీవ్రతను గ్రహించిన మనోజిత్ మిశ్రా జూన్ 26న తనకు గతంలో సాయం చేసిన దేశప్రియ పార్క్‌లోని ఓ పలుకుబడిగల వ్యక్తిని సంప్రదించాడు. అయితే, కేసు తీవ్రతను గమనించిన ఆ వ్యక్తి సాయం చేయడానికి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తనను కాపాడే వారి కోసం మనోజిత్.. రాష్‌బిహారీ, గరియాహత్, ఫెర్న్ రోడ్ వంటి నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లినట్టు మొబైల్ టవర్ డేటా ఆధారంగా గుర్తించామని అధికారులు వివరించారు.

మరోవైపు, ఈ కేసులో అరెస్టయిన సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ పోలీస్ కస్టడీని స్థానిక ఆలిపోర్ కోర్టు జులై 8 వరకు పొడిగించింది. ఇక సౌత్ కలకత్తా లా కాలేజీని రేపటి నుంచి పునఃప్రారంభించనున్నట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ప్రాజెక్టుల కోసం నిర్ణీత సమయాల్లో మాత్రమే రావాలని, గుర్తింపు కార్డు లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది. నేరం జరిగిన గార్డు రూమ్, యూనియన్ రూమ్‌లను తదుపరి ఆదేశాల వరకు మూసివేస్తున్నట్టు వెల్లడించింది. 
South Kolkata Law College Gang Rape
Kolkata Law College Rape Case
Manojit Mishra
Pinaki Banerjee
Law College Student Assault
Kolkata Crime
Gang Rape Investigation
Alipore Court
Kolkata Law College Reopening
Crime News Kolkata

More Telugu News