Akash Deep: ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం!

India Ends 58 Year Wait with Massive Win Over England at Edgbaston
  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ ఘన విజయం
  • 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన టీమిండియా
  • ఎడ్జ్‌బాస్టన్ గడ్డపై 58 ఏళ్ల తర్వాత తొలి టెస్టు గెలుపు
  • రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో కదం తొక్కిన కెప్టెన్ గిల్
  • రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లతో చెలరేగిన పేసర్ ఆకాశ్ దీప్
పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి 58 ఏళ్ల నిరీక్షణకు ఘనంగా తెరదించింది. ఈ మైదానంలో టెస్టు గెలవలేదన్న అపప్రదను టీమిండియా చెరిపేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. గత 58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్, ఈ గెలుపుతో బలంగా పుంజుకుంది.

608 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్, భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ముఖ్యంగా యువ పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తమ్మీద ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీయడం తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (88) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు 68.1 ఓవర్లలో 271 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్ ఆద్యంతం భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) డబుల్ సెంచరీతో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) శతకాలతో పోరాడినప్పటికీ, మహ్మద్ సిరాజ్ (6/70) విజృంభణతో 407 పరుగులకు పరిమితమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్, రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లోనూ కెప్టెన్ గిల్ (161) అద్భుత శతకంతో కదం తొక్కగా, పంత్ (65), జడేజా (69*) రాణించారు. బౌలింగ్‌లో ఆకాశ్ దీప్ మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు, సిరాజ్ 7 వికెట్లతో సత్తా చాటారు. 

తొలి టెస్టు ఓటమి తర్వాత, కీలక బౌలర్ బుమ్రా లేకుండానే ఇంతటి చారిత్రక విజయం సాధించడం గిల్ సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇక కెప్టెన్ గా గిల్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జులై 10 నుంచి లండన్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగనుంది.
Akash Deep
India vs England
Edgbaston Test
Shubman Gill
India win
Cricket
Test Cricket
Historic Victory
Mohammed Siraj
Ravindra Jadeja

More Telugu News