Ananda Raju Vegesna: రాజు వేగేశ్న పౌండేషన్ సంచాలకుడు ఆనందరాజు ఇకలేరు

Ananda Raju Vegesna Director of Raju Vegesna Foundation Passes Away
  • వేగేశ్న పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆనందరాజు
  • అనారోగ్యంతో బాధపడుతూ నిన్న విశాఖలో కన్నుమూసిన ఆనందరాజు 
రాజు వేగేశ్న పౌండేషన్ సంచాలకుడు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన వేగేశ్న ఆనందరాజు (67) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

పౌండేషన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆనందరాజు, దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం కోట్లాది రూపాయలు వెచ్చించారు. వారి కృషి ఫలితంగా తిరుమలలో రూ.77 కోట్లతో అన్నదాన సత్రం, రూ.27 కోట్లతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా తిరుపతి, ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.25 కోట్లతో అన్నదాన సత్రం నిర్మించారు.

ఆయన స్వస్థలమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలుగా అందించారు. దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో అనేక వసతులు కల్పించారు. పేద, ఆపదలో ఉన్న కుటుంబాల్లోని పిల్లల చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. 1979లో విశాఖకు తన నివాసాన్ని మార్చుకున్న ఆనందరాజు, గత పదేళ్లుగా హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. 
Ananda Raju Vegesna
Raju Vegesna Foundation
Visakhapatnam
Social Service
Tirumala
Yadadri Temple
Charity
Andhra Pradesh
Telangana
Philanthropy

More Telugu News