Venkatesh: చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటించడంపై వెంకటేశ్ క్లారిటీ

Venkatesh Clarifies Guest Role in Chiranjeevi Movie
  • చిరంజీవి సినిమాలో తనది ఫన్నీ రోల్ అని వెల్లడించిన వెంకటేశ్
  • మీనాతో కలిసి 'దృశ్యం 3' కూడా ఉంటుందని వెల్లడి
  • త్రివిక్రమ్ తో కలిసి మరో సినిమా చేస్తున్నానని తెలిపిన వెంకీ
ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్ తన రాబోయే చిత్రాల గురించి కీలక ప్రకటన చేసి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తాను నటించనున్నట్లు వస్తున్న వార్తలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. అమెరికాలో జరిగిన 'నాట్స్ 2025' వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ, "మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నేను ఒక అతిథి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర చాలా ఫన్నీగా ఉండి ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచుతుంది" అని తెలిపారు. దీంతో ఎప్పటినుంచో చిరంజీవి, వెంకీ అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్‌పై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రానున్న 'మెగా 157' చిత్రంలోనే వెంకటేశ్ నటించనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు శివశంకర వరప్రసాద్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇదే వేదికపై తన ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా వెంకటేశ్ పంచుకున్నారు. "మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, మీనాతో కలిసి 'దృశ్యం 3' కూడా ఉంటుంది. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మళ్లీ పనిచేయబోతున్నాం" అని వెల్లడించారు. వీటన్నింటితో పాటు తెలుగు పరిశ్రమకు చెందిన తన స్నేహితుడైన ఓ పెద్ద స్టార్‌తో కలిసి మరో భారీ చిత్రంలో నటించబోతున్నట్లు చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. తనపై ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Venkatesh
Chiranjeevi
Mega 157
Anil Ravipudi
Telugu cinema
Tollywood
Guest role
NATs 2025
Drushyam 3
Trivikram

More Telugu News