Tahawwur Rana: 26/11 ముంబై దాడులకు ప్లాన్ వేసిందిలా... విచారణలో కీలక నిజాలు కక్కిన తహవూర్ రాణా

Tahawwur Rana Reveals Mumbai Attacks Plot Details in Interrogation
  • ముంబై 26/11 దాడుల కుట్రపై కీలక వివరాలు వెల్లడించిన రాణా
  • మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీకి సాయం చేశానని విచారణలో అంగీకారం
  • తాను గతంలో పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో డాక్టర్‌గా పనిచేశానని వెల్లడి
  • దాడులకు ముందు నిఘా కోసం ముసుగు కంపెనీ ఏర్పాటు తన ఆలోచనేనని ఒప్పుకోలు
  • లష్కరే తోయిబా, ఐఎస్ఐతో సంబంధాలున్నాయని అంగీకారం
ముంబై 26/11 ఉగ్రదాడుల కేసులో ప్రధాన కుట్రదారుడైన తహవూర్ హుస్సేన్ రాణా, విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. సుదీర్ఘ దౌత్య పోరాటం తర్వాత భారత్‌కు అప్పగించబడిన 64 ఏళ్ల రాణా, ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ విచారణలో దాడుల వెనుక ఉన్న కుట్ర గుట్టు విప్పాడు. దాడుల మాస్టర్‌మైండ్ డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి తాను ఎలా సహాయపడ్డాడో పూసగుచ్చినట్లు వివరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ వంటి ప్రధాన ప్రాంతాలను లక్ష్యాలుగా గుర్తించడంలో హెడ్లీకి సహకరించానని రాణా అంగీకరించాడు. దాడులకు ముందు ఉగ్రవాదులు నిఘా పెట్టేందుకు వీలుగా 'ఇమ్మిగ్రెంట్ లా సెంటర్' పేరుతో ఒక ముసుగు కంపెనీని ఏర్పాటు చేయాలనే ఆలోచన తనదేనని రాణా ఒప్పుకున్నాడు. ఈ కంపెనీ ముసుగులోనే హెడ్లీ భారత్‌లోని పలు నగరాల్లో పర్యటించి సమాచారం సేకరించాడు.

గతంలో తాను పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో డాక్టర్‌గా పనిచేసినట్లు రాణా వెల్లడించాడు. సియాచిన్ వంటి సున్నిత ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు అనారోగ్యం కారణంగా విధులకు దూరమవడంతో తనను సైన్యం నుంచి పారిపోయిన వ్యక్తిగా ప్రకటించారని తెలిపాడు. ఈ రికార్డును సరిచేయిస్తానని హెడ్లీ హామీ ఇవ్వడంతోనే తాను ఉగ్రకుట్రలో భాగమైనట్లు చెప్పాడు. పాకిస్థాన్ సైనిక యంత్రాంగం, గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలతో తాను చురుగ్గా సమన్వయం చేసుకున్నట్లు అంగీకరించాడు. దాడుల సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ మీర్, అబ్దుల్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్ వంటి పాక్ అధికారులు తనకు తెలుసని కూడా రాణా అంగీకరించినట్లు సమాచారం.

నవంబర్ 2008లో దాడులకు కొద్దిరోజుల ముందు తాను ముంబైలోని పోవాయ్‌లో ఒక హోటల్‌లో బస చేసి, దాడులకు ముందు దుబాయ్ మీదుగా బీజింగ్ వెళ్లిపోయినట్లు రాణా విచారణలో తెలిపాడు. ఈ కేసులో రాణా పాత్రను 14 మంది సాక్షులు ధృవీకరించినట్లు క్రైమ్ బ్రాంచ్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
Tahawwur Rana
Mumbai attacks
26/11 Mumbai attacks
David Headley
Lashkar-e-Taiba
ISI
Pakistan Army
Chhatrapati Shivaji Terminus
Mumbai terror attack

More Telugu News