Nara Lokesh: టీడీపీలో కష్టపడేవారికే పదవులు.. రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Says Positions for Hard Workers Only in TDP
  • ఈ నెలాఖరులోగా ఏఎంసీ, దేవాలయ కమిటీల నియామకం పూర్తి చేస్తామ‌న్న మంత్రి
  • గత పొరపాట్లు పునరావృతం కానివ్వం.. పార్టీలో సంస్కరణలు తెస్తామ‌ని వెల్ల‌డి
  • ప్రతి 4 నెలలకోసారి కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలకు ప్ర‌ణాళిక‌
  • త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఏడాదే నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్న లోకేశ్‌
టీడీపీలో ఇకపై కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని, ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ పాల్గొని కీలక ప్రసంగించారు.

గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయబోమని, పార్టీలో ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని లోకేశ్‌ తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులైన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ), దేవాలయ కమిటీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, ప్రతి నాలుగు నెలలకోసారి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేలా సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. "సొంత కార్యకర్తలను కారు కింద తొక్కేసిన నేత జగన్. కనీసం వారిని పరామర్శించేందుకు కూడా వెళ్లలేదు. కానీ కందుకూరు దుర్ఘటన జరిగినప్పుడు చంద్రబాబు ప్రతి ఇంటికీ వెళ్లి క్షమాపణ చెప్పారు. మనకి, వాళ్లకి ఇదే తేడా" అని లోకేశ్‌ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి, ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన కేడర్‌కు సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఈ ఏడాదిలోనే నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేస్తున్నామని, మిగిలిన ఉద్యోగాలను కూడా పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండీ ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Nellore
Ponguru Narayana
NMD Farooq
Vemireddy Prabhakar Reddy
Abdul Aziz
AP Elections 2024

More Telugu News