Pawan Kalyan: పవన్ ను హీరోగా చూడటం కాపుల ఖర్మ: జక్కంపూడి రాజా

Pawan Kalyan Criticized by Jakkampudi Raja as Not a Real Hero
  • రంగా, ముద్రగడలాంటి వారే కాపులకు నిజమైన హీరోలు అన్న జక్కంపూడి
  • చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ పార్టీ పెట్టారా? అని ప్రశ్న
  • చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా మహిళలు, రైతులు మోసపోవడం ఖాయమన్న బొత్స
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జక్కంపూడి రాజా... పవన్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నాలుగు స్టెప్పులు వేసి మైక్ పట్టుకున్నంత మాత్రాన హీరో అయిపోరని, అలాంటి వ్యక్తిని హీరోగా చూడటం కాపుల ఖర్మ అని ఘాటుగా విమర్శించారు. పిఠాపురంలో వంగా గీత అధ్యక్షతన జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

పవన్ కల్యాణ్ తనను తాను ముఖ్యమంత్రి చేసుకోవడానికి పార్టీ పెట్టారా లేక చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పెట్టారా అని కాపు యువత ప్రశ్నించుకోవాలని జక్కంపూడి రాజా అన్నారు. వంగవీటి మోహన రంగా, ముద్రగడ పద్మనాభం వంటి వారే కాపులకు నిజమైన హీరోలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ ఎన్నిసార్లు పిఠాపురం వచ్చారని, ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకున్నారా అని నిలదీశారు. రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలోనే పవన్ రాజకీయంగా అంతం అవుతారని జోస్యం చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలు, రైతులు మోసపోవడం ఖాయమని ఆరోపించారు. మాయమాటలు చెప్పేవారిని మోసగాళ్లు అనడంలో తప్పేలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తామనడం దారుణమని అన్నారు. "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" అనే నినాదంతో ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీధికో రెండు బెల్టు షాపులు పెట్టారని, గంజాయి వ్యాపారంతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. మరో నేత తోట నరసింహం మాట్లాడుతూ, పిఠాపురంలోనే కూటమిలో కుర్చీలు, జెండాలతో కొట్టుకునే స్థాయికి విభేదాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. 

Pawan Kalyan
Jakkampudi Raja
YSRCP
Pithapuram
Andhra Pradesh Politics
Vanga Geeta
Botsa Satyanarayana
Telugu News
Kapu Community
Chandrababu Naidu

More Telugu News