Devineni Uma: అసెంబ్లీకి రాలేని జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరారు: దేవినేని ఉమా

Devineni Uma Criticizes Jagan Reddy for Not Attending Assembly
  • జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని దేవినేని ఉమా డిమాండ్
  • బెయిల్ పై ఉంటూ చట్టబద్ధ సంస్థలను బెదిరిస్తున్నారని ఆరోపణ
  • 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవడం లేదని మండిపాటు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాలేని జగన్ ఒక పిరికిపందని, ఆయన ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగేందుకు అనర్హుడని ఎద్దేవా చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బెయిల్‌పై బయట ఉన్న జగన్, చట్టాలను కాపాడే వ్యవస్థలనే బెదిరించేలా వ్యవహరించడం దారుణమని దేవినేని ఉమ అన్నారు. ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. జగన్‌పై ఉన్న కేసుల విచారణను పోలీసు, న్యాయవ్యవస్థలు ఒక సవాలుగా స్వీకరించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. వైఎస్ హయాంలో పెట్టిన కేసుల కోసం తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని గుర్తుచేశారు.

గత ఐదేళ్లలో జగన్ చేయలేని అభివృద్ధిని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది కాలంలోనే చేసి చూపించారని ఉమ స్పష్టం చేశారు. "ఒక్క ఛాన్స్" అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇప్పుడు మళ్లీ సింగయ్య శవం లాంటి ఘటనలతో కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదని, ఇంకా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుతంత్రాలు మానుకోకపోతే ప్రజలే వైసీపీని తరిమి తరిమి కొడతారని దేవినేని ఉమ హెచ్చరించారు. 
Devineni Uma
Jagan Mohan Reddy
TDP
YCP
Andhra Pradesh Assembly
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Corruption cases
Opposition leader
Amaravati

More Telugu News