జీ 5 వారు ఒకదాని తరువాత ఒకటిగా వెబ్ సిరీస్ లను వదులుతూ వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో జీ 5 నుంచి వచ్చిన 'గాలివాన'కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత కూడా మరికొన్ని వెబ్ సిరీస్ లను అందిస్తూ వచ్చిన జీ 5, తాజాగా 'పులి - మేక' వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేసింది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ ను జీ 5 వారు నిర్మించారు. కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించాడు. కోన్ వెంకట్ అందించిన ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కథలోకి వెళితే ..
పోలీస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి)కి ధైర్య సాహసాలు ఎక్కువ. పోలీస్ డిపార్టుమెంటుకు సవాళ్లు విసిరిన సమస్యలను తెలివిగా పరిష్కరించడంలో ఆమె ట్రాక్ రికార్డు ఒక రేంజ్ లో ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అంత కంగారం లేదులే అంటూ వాయిదా వేస్తుంటుంది. డ్యూటీపైనే దృష్టిపెడుతూ ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ నారాయణ్ (సుమన్) నుంచి కాల్ వస్తుంది. హైదరాబాదులో పోలీసులనే టార్గెట్ చేసుకుని వరుస హత్యలను చేస్తూ వెళుతున్న ఒక సీరియల్ కిల్లర్ కి సంబంధించిన ఆపరేషన్ ను ఆమెకి అప్పగిస్తాడు. ఆమెతో కలిసి ఫోరెన్సిక్ నిపుణుడైన ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) పనిచేస్తుంటాడు. ఆయన కిరణ్ ప్రభను ఆరాధిస్తూ ఉంటాడు.
ప్రభాకర్ శర్మ తండ్రి దివాకర శర్మ ప్రముఖ జ్యోతిష్కుడు. ప్రభాకర్ శర్మ అన్నయ్య కరుణాకర్ శర్మ (రాజా) ఆ కుటుంబానికి దూరంగా ఉంటూ ఉంటాడు. అతని మనసు మార్చడానికి ప్రభాకర శర్మ ప్రయత్నిస్తూనే, కిరణ్ ప్రభ పట్ల తన ప్రేమను కొనసాగిస్తూ ఉంటాడు. సీరియల్ కిల్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో ఆమెకి సహకరిస్తూ ఉంటాడు. ఒక హత్యకి సంబంధించి ఘటనా స్థలంలో లభించిన ఒక ఆధారం కారణంగా, హత్యలు ఎవరు చేస్తున్నది ప్రభాకర్ శర్మకి తెలిసిపోతుంది. ఆ హత్యలు చేస్తున్నది ఎవరు ? ఎందుకోసం చేస్తున్నారు? ఈ కేసు విషయంలో కిరణ్ ప్రభకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? అనేదే కథ.
దర్శకుడు చక్రవర్తి రెడ్డి సినిమాల నుంచి వచ్చినవాడే .. అనుభవం ఉన్నవాడే. అయితే 'పులి - మేక' మధ్య వేటలో ఆశించిన స్థాయి స్పీడ్ కనిపించదు. పోలీస్ కథలలో ఆసక్తిని పెంచేది అక్కడ చేసే హడావిడినే. ఏ మాత్రం ఆలస్యమైనా జరగరానిది జరిగిపోతుంది .. సాధ్యమైనంత వరకూ దానిని ఆపాలి అనే ఒక స్పీడ్ పోలీసులలో కనిపించేలా చేయకపోతే, ఆ పాత్రలతో కలిసి ప్రేక్షకుడు ప్రయాణం చేయలేడు.
పోలీస్ కమిషనర్ ఒక రాజకీయనాకుడి మాదిరిగా నింపాదిగా మాట్లాడుతూ ఉంటే, మిగతా పోలీస్ వాళ్లంతా తాపీగా తమ పనులను చక్కబెడుతూ ఉంటారు. పోలీస్ వెహికల్ తీయడం మొదలు .. ఘటనా స్థలానికి చేరుకోవడం వరకూ కనిపించని వేగమే ఈ కథలో ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది .. అనిపిస్తుంది. ఇక బిచ్చగాళ్ల హత్యలు వరుసగా జరగడానికీ, కరుణాకర్ శాస్త్రి తన కుటుంబానికి దూరంగా ఉండటానికి చెప్పిన కారణాలు సిల్లీగా అనిపిస్తాయి.
మర్దర్లకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ, పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన రిసెప్షన్, కిరణ్ ప్రభ - పల్లవి మధ్య గల స్నేహానికి సంబంధించిన సన్నివేశాలు బలహీనంగా కనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండగా, 6 వ ఎపిసోడ్ చివరి నుంచి కథకి కాస్త పట్టుదొరికి పైకి పాకటానికి ప్రయత్నిస్తుంది. 7 .. 8 ఎపిసోడ్స్ లోని ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ ..
కిల్లర్ లుక్ .. మర్డర్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ .. నిర్మాణ విలువలు .. చివరి రెండు ఎపిసోడ్స్ లో వచ్చే ట్విస్టులు.
మైనస్ పాయింట్స్ ..
సుమన్ లాంటి హీరోను ఫోన్ కాల్స్ కి మాత్రమే పరిమితం చేయడం .. సాఫ్ట్ రోల్స్ కి మాత్రమే సెట్టయ్యే లావణ్య త్రిపాఠిని యాక్షన్ రోల్ లో చూపించడం .. కథలో కొత్తదనం లేకపోవడం .. కథనంలో వేగం లోపించడం .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో లేకపోవడం .. 5 ఎపిసోడ్స్ లో చెప్పగలిగే కథను, 8 ఎపిసోడ్స్ వరకూ సాగదీయడం.
ఓటీటీ రివ్యూ: 'పులి - మేక' (జీ 5 వెబ్ సిరీస్)
Puli Meka Review
- జీ 5 నుంచి వచ్చిన 'పులి - మేక'
- పోలీస్ కథల్లో ఉండవలసిన వేగం లేకపోవడం
- అంతంత మాత్రంగా ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- కొన్ని సన్నివేశాలు మరింత పేలవం
- నిర్మాణ విలువల పరంగా ఓకే
Movie Name: Puli Meka
Release Date: 2023-02-24
Cast: Lavanya Tripathi, Adi Sai Kumar, Suman, Raja, Spandana Palli, Goparaju Ramana
Director:K Chakravarthi Redddy
Producer: Kona Venkat
Music: Praveen Lakkaraju
Banner: Kona Film Corporation
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer