మొదటి నుంచి కూడా విష్వక్ సేన్ కామెడీ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక ఒక్కోసారి తన సినిమాలకు తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలా సొంత బ్యానర్లో దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకుని ఆయన చేసిన సినిమానే 'దాస్ కా ధమ్కీ'. ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. మాస్ లుక్ తోను .. క్లాస్ లుక్ తోను విష్వక్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అయిందనేది చూద్దాం.
కృష్ణదాస్ (విష్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే హోటల్లో పనిచేసే ఆది (హైపర్ ఆది) మహేశ్ (మహేశ్) అతని స్నేహితులు. ఎలాంటి ఫ్యామిలీ నేపథ్యం లేనివారు. శ్రీమంతులైన కస్టమర్స్ వలన అనేక అవమానాలను ఎదుర్కుంటూ ఉంటారు. ఎప్పటికైనా శ్రీమంతులు కావాలనేది వాళ్లలో బలంగా ఉన్న కోరిక. అలాంటి పరిస్థితుల్లోనే కృష్ణదాస్ ఆ హోటల్ కి వచ్చిన కీర్తి (నివేదా పేతురాజ్) ప్రేమలో పడతాడు. శ్రీమంతుడిగా ఆమెను నమ్మిస్తూ వెళుతుంటాడు.
అయితే ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఒకే రూములో అద్దెకి ఉంటూ ఉంటారు. ఆ రూమ్ కి వారు అద్దె కట్టక చాలా కాలం కావడంతో, వాళ్ల సామన్లను ఓనర్ బైట వేయిస్తాడు. అదే సమయంలో రావు రమేశ్ వచ్చి వారిని ఆదుకుంటాడు. కృష్ణదాస్ ను వెంటబెట్టుకుని ఒక పెద్ద బంగ్లాకు తీసుకుని వెళతాడు. ఆ బంగ్లాలో అచ్చు తనని పోలిన వ్యక్తి డాక్టర్ సంజయ్ రుద్ర (మరో విష్వక్ సేన్ ) ఫొటో చూసి ఆశ్చర్యపోతాడు. తనని అక్కడికి తీసుకుని రావడానికి కారణం ఏమిటని అడుగుతాడు.
సంజయ్ రుద్ర తన అన్న కొడుకనీ .. అతను కేన్సర్ ను సమూలంగా తగ్గించే ఒక ఫార్ములాను కనుక్కున్నాడనీ .. ఆ మెడిసిన్ ను సప్లై చేయడానికిగాను ధనుంజయ్ దగ్గర 10 వేల కోట్లు తీసుకున్నాడనీ .. అయితే ఒక కారు ప్రమాదంలో సంజయ్ చనిపోయాడనీ .. ఈ విషయం బైట ప్రపంచానికి తెలియదని రావు రమేశ్ చెబుతాడు. ఓ పది రోజుల పాటు సంజయ్ రుద్ర మాదిరిగా నటిస్తే, అడిగినంత డబ్బు ఇస్తానని ఆశ చూపుతాడు. అందుకు అంగీకరించిన కృష్ణదాస్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? వాటిలో నుంచి బయటపడటానికి ఆయన ఏం చేస్తాడు? అనేదే కథ.
ఈ సినిమాకి విష్వక్ సేన్ దర్శకుడు .. చాలా రొటీన్ కథగా ఈ సినిమా మొదలవుతుంది. ఒక పేద యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి కోసం డబ్బున్నవాడిలా బిల్డప్ ఇవ్వడం .. ఆమెను నమ్మించడానికి నానా తంటాలు పడటం .. శ్రీమంతుడి ప్లేస్ లో అతనిలా కొనసాగడం .. ఈ తరహా అంశాలతో గతంలో చాలానే కథలు వచ్చాయి. ఇంటర్వెల్ వరకూ కూడా ఈ తతంగమే నడుస్తూ వెళుతుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఆడియన్స్ లో కుతూహలం పెరిగిపోతుంది. నెక్స్ట్ హీరో ఏం చేయబోతున్నాడు? అనే ఆసక్తి కలుగుతుంది. కానీ ఇక్కడి నుంచే కథలో గందరగోళం ఏర్పడుతుంది. అప్పటివరకూ దాచి ఉంచిన ట్విస్టులను ఒకదాని తరువాత ఒకటిగా రివీల్ చేయడం మొదలవుతుంది. వరుస ట్విస్టులను తట్టుకోలేక సగటు ప్రేక్షకుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంటాడు. సంజయ్ రుద్ర వచ్చిన దగ్గర నుంచి గందరగోళం మరింత ఎక్కువవుతుంది. చివరికి సీక్వెల్ ఉందని చెప్పేసి ముగించారు.
ఈ సినిమాకి స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చింది కూడా విష్వక్ నే. ఫస్టు పార్టు నిదానంగా నడవడం .. సెకండ్ పార్టులో ట్విస్టులు ఎక్కువైపోవడం ఒక లోపంగానే కనిపిస్తుంది. ఇక లియోన్ జేమ్స్ సంగీతం విషయానికి వస్తే, 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా' .. ' ఓ డాలర్ పిలగా' బాణీలు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త హెవీ అయినట్టుగా అనిపిస్తుంది. దినేశ్ కె బాబు ఫొటోగ్రఫీ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. కేన్సర్ ఫార్ములా .. ప్రొఫెసర్ ను చంపడం .. చివర్లో ఖైదీలతో డ్రగ్స్ వాడించడం వంటి సీన్స్ ను ఎడిటర్ గా అన్వర్ అలీ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో.
ప్లస్ పాయింట్స్ జాబితాలో విష్వక్ సేన్ యాక్షన్ .. నిర్మాణ విలువలు .. రెండు పాటలు .. కాస్తంత కామెడీ కనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్: సాధారణంగా ద్విపాత్రాభినయం అంటే ఇద్దరు హీరోలకు మధ్య లుక్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా కచ్చితమైన తేడాలు ఉండేలా చూసుకుంటారు. కానీ ఇక్కడ అంత పెద్ద తేడాలేం డిజైన్ చేయలేదు. రెండు పాత్రలు కూడా చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. గ్లామర్ పరంగా నివేదను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఇక చివరికి రావు రమేశ్ విలన్ గా తేల్తాడని అనుకుంటే అతని పాత్రను తేల్చేశారు. ఆశించిన స్థాయిలో విష్వక్ ధమ్కీ ఇవ్వలేకపోయాడనే చెప్పాలి.
దాస్ కా ధమ్కీ - మూవీ రివ్యూ
Das Ka Dhamki Review
- విష్వక్ సేన్ నుంచి వచ్చిన 'దాస్ కా ధమ్కీ'
- కొత్తదనం లేని కథాకథనాలు
- వైవిధ్యం కనిపించని ద్విపాత్రాభినయం
- స్లోగా నడిచిన ఫస్టు పార్టు
- ట్విస్టులు ఎక్కువైపోయిన సెకండ్ పార్టు
Movie Name: Das Ka Dhamki
Release Date: 2023-03-22
Cast: Vishwaksen, Niveda Pethuraj, Rao Ramesh, Ajay, Rohini, Tarun Bhaskar
Director:Vishwaksen
Producer: Karate Raju
Music: Leon Jems
Banner: Vishwaksen Cinemas
Review By: Peddinti
Rating: 2.50 out of 5
Trailer