'రోమాంఛమ్' - ఓటీటీ రివ్యూ

Romancham

Romancham Review

  • డిస్నీ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి 'రోమాంఛమ్'
  • ఈ నెల 7 నుంచి అందుబాటులోకి వచ్చిన సినిమా  
  • ఆత్మ నేపథ్యంలో స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది
  • అతి తక్కువ బడ్జెట్లో నిర్మితమైన సినిమా 
  • అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్  

ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న సినిమాలకి కాసుల వర్షం కురుస్తోంది. కంటెంట్ ఉంటే చాలు .. ఆ సినిమా ఒరిజినల్ భాష ఏది? ఆర్టిస్టులు ఎవరు? భారీ బడ్జెట్ తో తీశారా లేదా ? అనేది ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఇటీవల వచ్చిన చిన్న సినిమాలు సాధించిన పెద్ద విజయాలు .. అవి రాబట్టిన భారీ వసూళ్లను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాలలో 'రోమాంఛమ్' ఒకటిగా కనిపిస్తోంది. మలయాళంలో జాన్ పాల్ జార్జ్ నిర్మించిన ఈ సినిమాకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. కేవలం 3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన విడుదలై, 60 కోటలకి పైగా షేర్ ను వసూలు చేయడం విశేషం. 

అలాంటి ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది హారర్ కామెడీ జోనర్లో నిర్మితమైన సినిమా. సుషిన్ శ్యామ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై విడుదలకి ముందు అక్కడ పెద్దగా అంచనాలు లేవు. ఆ తరువాత అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ ద్వారా, తెలుగు ప్రేక్షకులలో ఎంతమందికి కనెక్ట్ కావొచ్చనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ బెంగుళూరులో మొదలవుతుంది .. అక్కడి శివారు ప్రాంతంలో, జీవన్ మాధవ్ .. నీరజ్ .. ముఖేశ్ .. శోభి రాజ్ .. కార్తీక్ .. రవి .. శివాజీ అనే ఏడుగురు స్నేహితులు కలిసి ఒక ఇంటిని అద్దెకి తీసుకుంటారు. ఈ ఏడుగురిలో రవి మాత్రమే జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అందువలన మిగతావారికి అతను కాస్త భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మిగతా ఆరుగురు కూడా, ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ వెళుతుంటారు. అయితే ఆ పనులు సక్రమమైనవి కాకపోవడం గమినించవలసిన విషయం. 

ఆ ఇంట్లో ఎవరు ఏయే పనులు చేయాలనేది నీరజ్ నిర్ణయించేస్తాడు. అతను చెప్పినట్టుగానే మిగతావారు ఆ పనులు చేస్తూ వెళుతుంటారు. ఈ నేపథ్యంలోనే 'ఓజా బోర్డు'ను ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ఆత్మలను ఆహ్వానించవచ్చనే విషయం జీవన్  కి తెలుస్తుంది. అందులో నిజం ఎంత? అనే విషయం తెలుసుకోవడానికి ఆయన ట్రై చేస్తాడు. 'స్పిరిట్ గేమ్' లో భాగంగా స్నేహితుల సమక్షంలో ఆత్మను పిలుస్తాడు. 'అనామిక' అనే ఆత్మ టచ్ లోకి వచ్చినట్టుగా స్నేహితులతో అబద్ధం చెబుతాడు. కానీ 'అనామిక' అనే ఆత్మను నిజంగానే తాను తట్టి లేపాననే విషయం ఆయనకి అర్థమవుతుంది. ఆ ఆత్మ తమతో పాటే తమ ఇంట్లోనే ఉంటోందనే విషయం తెలుస్తుంది. అప్పుడు ఆ స్నేహితులు ఏం చేస్తారు? అనేదే కథ. 

ఇది హారర్ కామెడీ జోనర్ లోని సినిమానే అయినా, ఎక్కడా ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నాలు జరగవు. నవ్వించడమే ప్రధానమైన లక్ష్యంగా ఈ కథ నడుస్తుంది. సాధారణంగా హారర్ సినిమాలు అనగానే కెమెరా పనితనంతో .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో .. లైటింగ్ తో భయపెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ అలాంటివేమీ ఈ సినిమాలో కనిపించవు. పెద్ద ఉద్యోగాలు  లేక .. పెద్దగా పనిలేక .. ఒకే ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచ్ లర్స్, తమ ఇంట్లో ఆత్మ ఉందనే విషయం తెలిస్తే ఎలా ఫీలవుతారో .. అంతే సహజంగా ఈ సినిమా నడుస్తుంది.

సాధారణంగా దెయ్యం సినిమాల్లో దెయ్యాన్ని చూపించకుండా ఉండరు. కానీ ఈ సినిమాలో 'అనామిక' అనే  దెయ్యం చుట్టూనే కథ నడుస్తూ ఉంటుందిగానీ, ఆ దెయ్యం మాత్రం కనిపించదు. అలాగే ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ కి హీరోయిన్ పెట్టే ప్రయత్నం కూడా దర్శకుడు ట్రై చేయలేదు. కథకి తగినట్టుగానే వెళ్లాడు. ఎవరికీ మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించాడు. ఒక ఇల్లు .. ఆ ఇంటి బయట గ్రౌండ్ .. ఆ ఫ్రెండ్స్ తిరిగే స్ట్రీట్స్ ను తప్ప కథ పొలిమేరను దాటేసి వెళ్లదు. అందువల్లనే చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాను చేయగలిగారు. 

ఫ్రెండ్స్ టీమ్ లోని వాళ్లంతా కూడా తమ బలహీనలతలను .. భయాలను చాలా సహజంగా ఆవిష్కరించారు. ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా ఉండదు. ప్రేక్షకుడు కూడా వాళ్లలో ఒక ఫ్రెండుగా ఉంటూ, జరుగుతున్నదంతా ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా ఉంటుంది.  సుషీన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సాను తాహిర్ కెమెరా పనితనం .. కిరణ్ దాస్ ఎడిటింగ్ కూడా కథకి తగినట్టుగానే నడిచాయి. అందరూ కూడా ఈ బడ్జెట్ తక్కువ మూవీని సహజత్వంతో ఆవిష్కరించడానికే తమవంతు ప్రయత్నం చేశారు. 

మలయాళ ప్రేక్షకులు సహజత్వానికి పెద్దపీట వేస్తుంటారు. కథకి హంగూ ఆర్భాటాలు అద్దడం .. హడావిడి చేయడం వారికి నచ్చదు. వాళ్లు స్టార్స్ మాత్రమే కథను నడిపించాలనే ఒక నియమాన్ని కూడా పెట్టుకోరు. అందువలన అదే పద్ధతిలో ఈ కథ నడుస్తూ వెళుతుంది. అయితే తెలుగు ప్రేక్షకులు హారర్ కామెడీ సినిమాల నుంచి కోరుకునే అవుట్ పుట్ వేరు. అందువలన కొంతమందికి ఈ కంటెంట్ కనెక్ట్ కాకపోవచ్చు. సహజత్వాన్నీ .. అందులో నుంచి పుట్టే కామెడీని ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. 

Movie Name: Romancham

Release Date: 2023-04-07
Cast: Soubin Shahir, Anantha Raman, Sajin Gopu, Abin Bino, Siju Sunny, Afzal
Director:Jithu Madhavan
Producer: Johnpaul George
Music: Sushin Shyam
Banner: Goodwill Entertainments

Rating: 2.75 out of 5

More Reviews