లారెన్స్ చాలా గ్యాప్ తరువాత చేసిన సినిమా 'రుద్రుడు'. గతంలో ఆయన నుంచి వచ్చిన హారర్ కామెడీ సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి. అదే జోనర్లో ఈ సినిమా ఉంటుందేమోనని చాలామంది అనుకున్నారు. కానీ ఇది యాక్షన్ సినిమా అనీ .. మదర్ సెంటిమెంట్ ఉంటుందని ప్రమోషన్స్ లో లారెన్స్ చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను ఒకే రోజున ఈ సినిమా విడుదలవడం విశేషం.
కథలోకి వెళితే .. రుద్ర (లారెన్స్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన తండ్రి దేవరాజు (నాజర్) ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతూ ఉంటాడు. రుద్ర ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ సంపాదించుకుంటాడు. అదే ప్రాంతంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న అనన్య (ప్రియా భవాని శంకర్ )తో అతనికి పరిచయమై అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే దేవరాజును అతని భాగస్వామి నమ్మించి మోసం చేస్తాడు. దాంతో దేవరాజు ఓ వ్యక్తికి 6 కోట్లు అప్పుగా చెల్లించవలసి వస్తుంది.
ఈ విషయంలో టెన్షన్ పడిన దేవరాజు హార్ట్ ఎటాక్ తో చనిపోతాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి పోలీస్ కేసు పెడతాడు. ట్రావెల్స్ అమ్మేసి కొంత డబ్బు చెల్లించిన రుద్ర. మిగతా డబ్బు సంపాదించడానికి ఫారిన్ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అనన్యను పెళ్లి చేసుకుని, తల్లి బాధ్యతను ఆమెకి అప్పగిస్తాడు. అతను ఫారిన్ వెళ్లిన తరువాత ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఇక మరో వైపున ఆ ప్రాంతంలో గ్యాంగ్ లీడర్ గా అందరినీ హడలెత్తించే భూమినాథన్ (శరత్ కుమార్) రుద్రకోసం గాలిస్తుంటాడు? అందుకు కారణం ఏమిటి? అనేదే కథ.
ఈ సినిమాకి నిర్మాత .. దర్శకుడు కథిరేసన్. దర్శకుడిగా ఇది ఆయనకి ఫస్టు మూవీ. ఈ కథను ఆయన ఎత్తుకున్న తీరు .. ఒక వైపున లారెన్స్ ఇంట్రడక్షన్ సీన్ .. మరో వైపున శరత్ కుమార్ ఎంట్రీ సీన్ తో ఆడియన్స్ ను కథలోకి తీసుకుని వెళతాడు. అయితే ఆ తరువాత అరగంటసేపు కథనంలో వేగం లేకపోవడంతో ఆడియన్స్ జారిపోవడం మొదలవుతుంది. సీట్లలోని ప్రేక్షకులు అసహనంగా కదులుతారు.
బిజినెస్ లో ఒక భాగస్వామి తన తండ్రిని మోసం చేస్తే, హీరో ఎలా అతని అంతు చూశాడనేదే కథ అనే ఒక నిర్ధారణకు ఈ అరగంటలోనే ప్రేక్షకులు వచ్చేస్తారు. సరిగ్గా ఆ సమయంలోనే కథ కొత్త పాయింట్ కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ పాయింట్ ను ముందుకు తీసుకుని వెళ్లిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చివరికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కూడా అడియన్స్ కి సంతృప్తి కరంగా అనిపిస్తుంది. చివర్లో ఇచ్చిన సందేశం కూడా ఆలోచనలో పడేస్తుంది.
లారెన్స్ సినిమాలో డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో ఫస్టాఫ్ లో వచ్చే పాటల్లో సాహిత్యం ఒక్క ముక్క అర్థం కాదు. కానీ కొరియోగ్రఫీ డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇక లారెన్స్ ఇంట్రడక్షన్ ఫైట్ .. జాతరలో రౌడీ మూక నుంచి తన కూతురును కాపాడుకునే ఫైట్ .. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే ఫైట్ ఈ సినిమాకి హైలైట్. ఈ మూడు కూడా భారీ యాక్షన్ సీన్స్ కావడం విశేషం.
ఒక వైపున మదర్ సెంటిమెంట్ .. మరో వైపున కూతురు సెంటిమెంట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ మధ్యలో భార్య తాలూకు ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. లారెన్స్ పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆయన యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. శరత్ కుమార్ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటాడు. ప్రియా భవాని శంకర్ .. కాళీ వెంకట్ .. నాజర్ పాత్ర పరిధిలో నటించారు. పాటల పరంగా ట్యూన్స్ బాగానే అనిపిస్తాయిగానీ, తెలుగు సాహిత్యం అర్థం కాదు. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ అదే మూడ్ లో ఉండేలా చూసింది.
ఇక రాజశేఖర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. క్లిష్టమైన సన్నివేశాలను కూడా ఆయన గొప్పగా చిత్రీకరించాడు. ఆంథోని ఎడిటింగ్ ఫరవాలేదు. హీరో వైపు నుంచి ఈ కథ ఫ్లాష్ బ్యాక్ లో నుంచి బయటికి రావడం .. ప్రెజెంట్ లో కొంత కథ జరిగిన తరువాత మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయినా ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకున్నారు. కాకపోతే ఫస్టు అరగంటలో సీన్స్ ను కాస్త టైట్ చేస్తే ఇంకా బాగుండేది.
ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. లారెన్స్ మేజిక్ .. శరత్ కుమార్ యాక్టింగ్ .. కొత్త పాయింట్ .. ఆలోచింపజేసే సందేశం.
మైనస్ పాయింట్స్: ఫస్టు అరగంటలో కథనం నెమ్మదించడం .. అంతగా ప్రాముఖ్యత లేని సన్నివేశాలను సాగదీయడం .. డబ్బింగ్ సినిమా పాటలంటే ఇలాగే ఉండాలన్నట్టుగా పట్టించుకోకపోవడం .. ఆ పాటల్లో సాహిత్యం అర్థం కాకపోవడం. హింస పాళ్లు ఎక్కువగానే ఉండటం. ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉందని చెప్పడం విశేషం.
'రుద్రుడు' - మూవీ రివ్యూ
Rudrudu Review
- లారెన్స్ హీరోగా రూపొందిన 'రుద్రుడు'
- తనదైన స్టైల్ తో మేజిక్ చేసిన లారెన్స్
- డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించిన శరత్ కుమార్
- కొత్త పాయింటును టచ్ చేస్తూ నడిచిన కథ
- డాన్సులు .. ఫైట్లు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్
Movie Name: Rudrudu
Release Date: 2023-04-14
Cast: Lawrence, Priya Bhavani Shankar, Sarath Kumar, Nassar, Poornima Bhagya Raj
Director:Kathiresan
Producer: Kathiresan
Music: Sam CS
Banner: Five Star Creations
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer